మాజీ ఐఏఎస్ ఇంట్లో పనిమనిషి హత్య
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ అధికారి నూర్ మహ్మద్ ఇంట్లో పనిమనిషి హత్యకు గురైంది. మరో పనిమనిషి ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం ఎన్నికల సంఘం కార్యాలయంలో కన్సల్టెంట్గా పనిచేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి నూర్ మహ్మద్ భార్య, తల్లితో కలిసి ఈస్ట్ ఎండ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. ఇంట్లో వంటపని వంటికి చూసుకునేందుకు గత ఏడాది ఓ పనిమనిషిని కుదుర్చుకున్నారు.
ఆమెతోపాటు మరో వ్యక్తి కూడా ఇంట్లో పనిచేస్తున్నాడు. పనిమనిషి కోసం ఇంట్లోనే ప్రత్యేకంగా ఓ గది కూడా కేటాయించారు. ఇదిలాఉండగా బయటకు వెళ్లివచ్చిన భార్యాభర్తలు పనిమనిషి గది తెరిచి ఉండడం చూసి లోపలికి వెళ్లారు. గదిలో మంచంపై పనిమనిషి పడి ఉండడం చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మెడపై గాయాలున్నాయని, ఉరివేసి హత్య చేసేందుకు ప్రయత్నించడం వల్లే ఆ గాయాలు ఏర్పడ్డాయని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.