సమస్యను గుర్తిస్తే విజయం మీ సొంతమే
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలామ్
మార్టూరు: శనివారం రాత్రి మార్టూరులోని శారదానికేతన్ పబ్లిక్ స్కూల్ భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలామ్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. తన ఇంట్లో తాతయ్య సూక్తులు చెబుతున్నట్టుగా ఆయన ఉపన్యాసం సాగింది. ఇటు ఉపాధ్యాయులకు, అటు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ... సమాజానికి ... ఎవరేమి చేయాలో ఆ సందేశంలో ప్రస్తావించారు.
మార్టూరు ఎందుకు వచ్చానో తెలుసా... పోలినేని సుబ్బారావు అనే మానవతావాది గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్ని వసతులు కల్పించి ఒక గొప్ప పాఠశాలను ప్రారంభించారు ... ఇది ఎంతో స్ఫూర్తిదాయం ... పదుగురూ దీన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు.
అనాథలు కాకూడదనే..
శారదానికేతన్ ఫౌండర్ పోలినేని సుబ్బారావు మాట్లాడుతూ తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని, తన పెదనాన్న, పెద్దమ్మలే పెంచారన్నారు. అన్న నాగేశ్వరరావే తను చదువుకోవటానికి కారణమన్నారు. తాను కోల్పోయిన బాల్యపు మధురసృ్కతులు ఎవ్వరు కోల్పోకూడదనే అనాధలకు బాసటగా నిలుస్తూ ఈ పాఠశాలను స్ధాపించానన్నారు.
2010లో పేద పిల్లలను చేర్చుకున్నామని, 2011లో హైచ్‌ఐవి సోకిన విద్యార్థులను కూడా పాఠశాలలో చేర్చుకుంటున్నామన్నారు. తన ఆస్తి మొత్తాన్ని పాఠశాలకే రాసిచ్చానన్నారు. తన భార్య వెంగ మాంబ, కుమార్తె కవిత, తన కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. పదిమందికి మంచి చేస్తే అరోగ్యం అదే వస్తుందని గాంధీజీ సూక్తే నాకు స్ఫూర్తి అని అన్నారు.
కలాంకు ఘన స్వాగతం...
కలాంకు పోలినేని సుబ్బారావు, రాష్ట్రమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, శిద్ధారాఘవరావు, పర్చూరు ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ శ్రీకాంత్, డీఎస్పీ సి.జయరామరాజు, గ్రామానికి చెందిన ప్రముఖులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు ఘన స్వాగతం పలికారు.
⇒ అపజయానికి కారణమేమిటో ... ఆ సమస్య మెలిక ఎక్కడుందో మీరు గుర్తించండి... విజయం మీ సొంతమవుతుంది.
⇒ తల్లి ఆనందంగా ఉంటే ప్రాంతం,రాష్ట్రం, దేశం,ప్రపంచం సంతోషంగా ఉంటుంది. అందుకే మీ అమ్మా,నాన్నలను గౌరవించండి .
⇒ ఉన్నత చదువులు చదివి ... డిగ్రీలు వరుసగా సాధించి ... పతకాలు మెడలో వేసుకుంటే సరిపోదు ... విలువలతో కూడిన విద్య అవసరం. అప్పుడే అసలైన ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
⇒ విద్యార్థ్ధులు చిన్నప్పటి నుంచే ధైర్యాన్ని అలవరుచుకోవాలి... ప్రతి అంశాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించుకోవాలి.
⇒ నేను పది సంవత్సరాల వయస్సులో ఐదో తరగతి చదువుతున్నప్పుడు శివసుబ్రమణ్యం అనే ఉపాధ్యాయుడు తమిళం, సంసృ్కతం, కెమిస్ట్రీ ఇలా అన్ని రంగాల్లో బోధించేవారు. ఒక రోజు నల్లబల్లపై పక్షులు ఆకాశంలో ఎగిరే బొమ్మను వేశారు ... ఆప్పుడు ఆ బొమ్మను చూసి ఆకాశంలో పక్షి ఎలా ఎగురుతుందనే ప్రశ్న తలెత్తింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనే తపనతోనే ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో చేరాను. అధ్యాపకుడిగా, సైంటిస్ట్‌గా, రాష్ట్రపతిగా ఇలా ఎన్ని పదవులు అలంకరించా.
⇒ ఎన్ని పదవులు అధిరోహించినా బోధనా వృత్తే నాకు ఇష్టం.
⇒ తామస్ ఆల్వా ఎడిసన్, లైటును, మేడం క్యూరీ రేడియంను,ఇంటర్ నెట్‌ను తిమోతీ బెర్నర్‌లీ, సర్ సీవీ రామన్ వంటి శాస్త్రజ్ఞులు 20వ శతాబ్దంలోనే తవ విజ్ఞానంతో ప్రపంచానికి వెలుగులు ఇచ్చారు ... వారి జీవిత చరిత్రలను చదవండి ... వారి అడుగు జాడలే మీకు దిక్సూచికలు కావాలి.
⇒ సమస్యలను అధిగ మించితేనే విజయం సొంతం అవుతుంది. అపజయానికి కారణాలేమిటో తెలుసుకోండి ... విజయసోపానాలు మీ ముందు వాలుతాయి.
⇒సృజనాత్మక విద్య అవసరం ...కంఠస్థా చేసి పరీక్షల్లో రాసి మార్కులు సాధించడం విద్య కాదు.
⇒ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వ్యక్తిత్వమే మనిషిని ఉన్నతంగా నిలుపుతుంది.
⇒ ప్రతి చెట్టు 20 కిలోల కార్భన్ డైయాక్సైడ్‌ను పీలుస్తుంది. అంటే ప్రతి విద్యార్థి ఓ మొక్కను నాటితే 20 కిలోల ఆక్సిజన్‌ను సమాజానికి అందించినట్టే కదా... అందుకే అందరూ మొక్కలు నాటాలి. విద్యార్థులే ఇందుకు ఆదర్శంగా నిలవాలి.
⇒ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.