సంఘ విద్రోహశక్తులపై ఉక్కుపాదం
పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
ఎస్పీగా బాధ్యతల స్వీకరణ
దుగ్గల్‌కు జిల్లా పరిస్థితిని వివరించిన తాజా మాజీ ఎస్పీ ప్రభాకర్‌రావు
నల్లగొండక్రైం : ‘సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపుతాం. జిల్లాలో శాంతిభద్రతలపై రాజీపడేదిలేదు. సమర్థంగా నిర్వహిస్తాం. ప్రజల మాన, ప్రాణ రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ మా యంత్రాంగం పనిచేస్తుంది’ అని కొత్త ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. సోమవారం ఆయన తాజామాజీ ఎస్పీ ప్రభాకర్‌రావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాను పూర్తిగా ఆకళింపు చేసుకుంటానన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఎంతటి వ్యక్తులను వదిలిపెట్టేది లేదన్నారు. పోలీసు అమరుల కుటుంబాలను తాను వ్యక్తిగతంగా, అదే విధంగా రాష్ట్ర పోలీసు సంఘం నుంచి, జిల్లా అసోసియేషన్ నుంచి ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం అమరుల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
ఆయా కుటుంబాలను కలిసి భరోసా కల్పిస్తానన్నారు. సిమి ఉగ్రవాదుల ఎన్కౌంటర్ విషయం గురించి తెలుసుకుంటానన్నారు. ఇంకా ఎవరైనా పారిపోయారా, లేక జిల్లాలోనే ఉన్నారా అనే వివరాలపై ఆరా తీస్తానన్నారు. జిల్లా పరిస్థితిని, పెండింగ్ కేసుల వివరాలు, జిల్లాలో తీవ్రవాదం, ఇటీవల సంఘటనను నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దుగ్గల్‌కు బదిలీపై వెళ్తున్న ఎస్పీ ప్రభాకర్‌రావు వివరించారు. అంతకుమందు దుగ్గల్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. నూతన ఎస్పీకి పోలీసు సంక్షేమ సంఘం వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ ఇరుగు సునిల్‌కుమార్, రామచంద్రంగౌడ్, అమర్‌సింగ్, యాదగిరి, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
అమరులకు నివాళి
ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన పోలీసు అమరుల చిత్రపటానికి పోలీసు కార్యాలయంలో తాజామాజీ ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.