రాజకీయం చేయొద్దు: 'తెహల్కా' బాధితురాలు
న్యూఢిల్లీ: తనను రాజకీయాల్లోకి లాగొద్దని తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తెహల్కా మాజీ మహిళా జర్నలిస్టు అభ్యర్థించింది. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని రాజకీయ పార్టీలను ఆమె కోరింది. లింగ, అధికారం, హింస వంటి అంశాలపై స్పందించేటపుడు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది.
తరుణ్ తేజ్పాల్పై తాను ఫిర్యాదు చేయడాన్ని 'ఎన్నికల ముందు కుట్ర'గా అభివర్ణించడాన్ని తనను కలచివేసిందని వాపోయింది. తాను ఫిర్యాదు చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తనపై వేసిన నిందలను తిరస్కరిస్తున్నట్టు 'కాఫిలా' అనే వెబ్సైట్లో పోస్ట్ చేసింది. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా గోవా పోలీసుల ముందు లొంగిపోయేందుకు తరుణ్ తేజ్ పాల్ తన భార్య, కూతురు, సోదరుడితో కలిసి ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరారు.