formers loans
-
రైతులకు తనఖా లేకుండా రూ.2 లక్షల రుణం
న్యూఢిల్లీ: రైతులకు తనఖా లేని రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ఇది 2025 జనవరి 1 నుండి అమలులోకి రానుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు ఆదేశించింది. ఇప్పటి వరకు తనఖా లేని రుణ పరిమితి రూ.1.6 లక్షలు ఉంది. ముడిసరుకు వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే లక్ష్యంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) రుణాలు సులభంగా రైతులకు చేరేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య దేశంలోని చిన్న, సన్నకారు భూస్వాములైన 86 శాతం మంది రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది. ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను వేగంగా అమలు చేయాలని, కొత్త రుణ నిబంధనలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఈ సందర్భంగా సూచించింది. వ్యవసాయ రంగంలో ఆర్థిక సేవలను పెంపొందించడానికి, వ్యవసాయ కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టడానికి, వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి రైతులకు అవసరమైన ఆర్థిక సౌలభ్యాన్ని అందించడానికి ఈ చొరవ ఒక వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తున్నారు. వ్యవసాయ ముడిసరుకు ఖర్చులపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పరిష్కరించడం, రుణ లభ్యత పెంచడం, వ్యవసాయ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం కోసం ఈ చొరవ కీలక దశగా ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు. -
రైతులకు 2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌లో భాగంగా రెండో రోజు రూ. 3.16 కోట్ల ప్యాకేజీని గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో వలస కూలీలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, రైతులకు రాయితీపై రుణ సదుపాయం, వీధి వ్యాపారులకు పెట్టుబడి.. మొదలైనవి ఉన్నాయి. స్వస్థలాల్లో లేని వలస కూలీలకు రానున్న రెండు నెలల పాటు నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల ఆహార ధాన్యాలను, కుటుంబానికి 1 కేజీ పప్పు ధాన్యాలను ఉచితంగా అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ, లేదా రాష్ట్ర ప్రభుత్వ రేషన్ కార్డు లేని సుమారు 8 కోట్ల మంది వలస కూలీలు ప్రయోజనం పొందనున్నారు. దీనికోసం దాదాపు రూ. 3500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు నిర్మల చెప్పారు. ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది. రైతుల కోసం.. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ. 2 లక్షల కోట్లను రాయితీపై రుణంగా అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 2.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారన్నారు. పీఎం–కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రాయితీపై రుణాలందించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడ్తామన్నారు. మత్స్యకారులు, పశుసంవర్థక రంగంలోని రైతులు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చన్నారు. , జూన్‌లో రైతులకు రబీ అనంతర, ప్రస్తుత ఖరీఫ్ అవసరాల కోసం నాబార్డ్ ద్వారా గ్రామీణ సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ. 30 వేల కోట్లు అందుబాటులోకితెస్తారు. గృహ నిర్మాణరంగానికి ఊతమిచ్చేందుకు రూ. 70 వేల కోట్లను ఆమె ప్రకటించారు. రూ. 6–18 లక్షల వార్షిక ఆదాయ వర్గాల వారికి ఇళ్ల కొనుగోలుకు సబ్సీడీ రుణ సదుపాయాన్ని ఏడాదిపెంచారు. ప్రభుత్వ నిధులతో నగరాల్లో నిర్మితమైన గృహ సముదాయాల్లో వలస కార్మికులు, పేదలు తక్కువ అద్దెతో ఉపయోగించుకునేలా ‘అఫర్డబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్స్’లను ఏర్పాటు చేస్తామన్నారు. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్ వలస కూలీలు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా అక్కడి రేషన్ షాపుల్లో తమ రేషన్‌ను పొందేందుకు ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్’ వీలు కల్పిస్తుందన్నారు. ఈ అంతర్రాష్ట్ర రేషన్ కార్డ్ పోర్టబిలిటీ దేశవ్యాప్తంగా మార్చి 2021 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. వలస కార్మికుల పరిస్థితిపై తమ ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్న నిర్మల.. ఇప్పటికీ తలపై తమ వస్తువులు మోసుకుంటూ, చిన్న పిల్లలతో పాటు హైవేలపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కానీ, రాష్ట్రాల రేషన్ కార్డు ద్వారా కానీ లబ్ధి పొందనటువంటి వారికి.. ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యం, ఒక్కో కుటుంబానికి కేజీ శనగపప్పు చొప్పున రెండు నెలల పాటు ఉచితంగా అందిస్తాం’ అని నిర్మల వివరించారు. ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు ఉన్నవారికి జూన్ వరకు మూడు నెలల పాటు ఒక్కొక్కరికి 5 కేజీల ఆహార ధాన్యం, కుటుంబానికి కేజీ పప్పుధాన్యం ఉచితంగా ఇస్తున్నారు. దీని ద్వారా దాదాపు 80 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. స్వస్థలాలకు నడిచి వెళ్తున్న వారి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నాయన్నారు. ఇందుకోసం రాష్ట్రాలు సబ్సిడీ ధరలకు కేంద్రం నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఇందుకు రుణసదుపాయం కూడా ఉందన్నారు. వలస కార్మికులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ఇతర దాతృత్వ సంస్థలు కేజీకి రూ. 24 చొప్పున గోధుమలు, కేజీకి రూ. 22 చొప్పున బియ్యాన్ని సబ్సిడీ ధరకు కేంద్రం నుంచి కొనుగోలు చేయవచ్చన్నారు. భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా బుధవారం రూ. 5.94 లక్షల కోట్ల ప్రయోజనాలను ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. వీధి వ్యాపారులకు.. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు, వారు మళ్లీ తమ వ్యాపారాలను ప్రారంభించుకునేలా ఒక్కొక్కరికి రూ. 10 వేలను పెట్టుబడి రుణంగా అందిస్తామని నిర్మల తెలిపారు. ఈ భారం ప్రభుత్వంపై సుమారు రూ. 5వేల కోట్ల వరకు ఉండొచ్చన్నారు. ముద్ర–శిశు రుణ పథకం కింద రూ. 50 వేల వరకు అప్పు తీసుకున్న చిన్నతరహా వ్యాపారులకు 2% వడ్డీ రాయితీ కల్పించాలని కూడా నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి ఈ వడ్డీ రాయితీ 12 నెలల పాటు కొనసాగుతుందన్నారు. దీనితో ప్రభుత్వంపై రూ. 1500 కోట్ల భారం పడుతుందన్నారు. కాంపా(కంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధుల్లో ఉపాధి అవకాశాల కోసం రూ. 6 వేల కోట్లను కేటాయిస్తున్నామన్నారు. అడవుల విస్తీర్ణం పెంచే దిశగా మొక్కలు నాటేందుకు, అటవీ పరిరక్షణ కార్యక్రమాలకు స్థానికులకు ఉపాధి లభించేలా ఈ నిధులను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చన్నారు. రైతులు, కార్మికులకు ప్రయోజనకరం: ప్రధాని మోదీ కేంద్రం రెండో విడత ప్రకటించిన ప్రోత్సాహకాలు రైతులు, వలస కార్మికులకు ఎంతగానో ఉపయోగపడతాయి. సహాయక చర్యలు ముఖ్యంగా మన రైతులు, వలస కార్మికులకు తోడ్పడతాయి. అందరికీ ఆహార భద్రతతోపాటు, చిరు వ్యాపారులు, రైతులకు రుణాలు అందుతాయి. జుమ్లా ప్యాకేజీ: కాంగ్రెస్.. సీతారామన్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అంతా వట్టిదే. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి జీడీపీలో 10 శాతం, రూ.40 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ప్రధాని ఘనంగా చేసిన ప్రకటనకు ఈ ప్యాకేజీకి సంబంధం లేదు. రోడ్ల వెంట సొంతూళ్లకు నడిచి వస్తున్న వలస కార్మికుల కోసం సాయం ప్రకటిస్తారని ఎదురుచూశాం. నిరాశే మిగిలింది. పేదల పట్ల పరిహాసం ఈ ప్యాకేజీ: సీపీఎం ఆర్థికమంత్రి ప్రకటించిన ప్యాకేజీ రాజకీయ ఎత్తుగడ. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఏ ఒక్క సమస్యకూ దీనితో పరిష్కారం లభించదు. వలస కార్మికులను కనీసం సొంతూళ్లకు కూడా చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఉద్యోగాలు కోల్పోయిన పేదలకు రూ.7,500 కోట్లు సాయం అందించాలి. ఆ గణాంకాలతో ఏమీ ఒరగదు: సీపీఐ ప్రోత్సాహకాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్న గణాంకాలు అర్థం లేనివి. తికమక లెక్కలు. రాజకీయ ప్రయోజనాలు తప్ప ఏమీలేదు. వేలాది మైళ్లు రోడ్ల వెంట నడిచి వెళ్తున్న వలస కార్మికుల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపలేదు. పట్టణ నిరుద్యోగం అంశాన్ని ఆమె పట్టించుకోలేదు. -
‘రైతు రుణాలకు ఆ నిబంధన తొలగించాలి’
న్యూఢిల్లీ : రైతుల సిబిల్ స్కోర్ ప్రాతిపదికపైనే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలంటూ విధించిన షరతును వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభ జీవో అవర్‌లో ఈ అంశంపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించి రైతులకు సకాలంలో రుణం లభించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎల్లప్పుడూ చురుకైన పాత్ర పోషిస్తుంటాయని అన్నారు. అయితే వ్యవసాయ రుణాల మంజూరీకి సంబంధించి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన మార్గదర్శకాలలో సిబిల్ స్కోర్ అత్యంత ఆక్షేపణీయమైనదని పేర్కొన్నారు. సిబిల్ స్కోర్ ప్రాతిపదికపైనే రుణాలు మంజూరు చేయాలన్న నిబంధన కారణంగా చాలా మంది రైతులు రుణాలు అందక అవస్థలు పడుతున్నారని చెప్పారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సిబిల్ నమోదైన లావాదేవీల ప్రాతిపదికన డిఫాల్టర్లుగా చూపుతూ బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని ఆయన కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు రైతులకు మేలు చేయకపోగా.. వారిని ఇక్కట్ల పాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో వ్యవసాయరంగం పూర్తిగా వర్షాధారమని.. వరదలు, వడగళ్లు, కరువు, కాటకాలు, వాతావరణంలో సంభవించే ఆకస్మిక పరిణామాల కారణంగా 75 శాతం నుంచి 80 శాతం రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం వల్ల రైతులు పంట నష్టపోయి.. వ్యవసాయ రుణాలు చెల్లించలేక డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నారని చెప్పారు. సిబిల్ స్కోర్ ఆధారంగా రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలన్న నిబంధంగా ఏ విధంగా సహేతుకం అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ నిబంధనను తక్షణమే తొలగించాలని.. విశ్వసనీయత ప్రాతిపదికపైనే బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
వడ్డీ రాయితీకి చంద్రగ్రహణం
మూడేళ్లలో రూ.90 కోట్లు పెండింగ్ సహకారం... రైతులకు రుణపాశం చేష్టలుడిగి చూస్తున్న ప్రజాప్రతినిధులు సహకార రంగానికి ప్రభుత్వ సహకారం కొరవడుతోంది ... ఊపిరి పోయాల్సిన సర్కారే ఊపిరితీస్తోంది. రుణాలపై వడ్డీ రాయితీకి రిక్త హస్తం చూపుతూ రైతుల ఆశలకు పాడి కట్టేయడానికే అడుగులు వేస్తోంది. గడచిన మూడేళ్లుగా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతుల జీవితాలతో దాగుడు మూతలు ఆడడంతో పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటంలా పరిస్థితి తయారైంది. ప్రభుత్వం విడుదల చేస్తుందనే నమ్మకంతో ఒక ఏడాది వడ్డీ రాయితీ మినహాయించి రుణాలు జమచేసుకున్న సహకార సంఘాలు నేడు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : సహకార రుణాలపై వడ్డీ రాయితీకి ప్రభుత్వం మంగళంపాడేసేలా కనిపిస్తోంది. గడచిన మూడేళ్లుగా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాయితీ సొమ్ము విడుదల చేయకుండా రైతులను, సహకార సంఘాలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తుందనే నమ్మకంతో ఒక ఏడాది వడ్డీ రాయితీ మినహాయించి రుణాలు జమచేసుకున్న సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోయాయి. మరో ఏడాది రాయితీ కోసం జీఓ కూడా విడుదలచేసి రాయితీ సొమ్ము మాత్రం విడుదల చేయకుండా ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఈ రకంగా గడచిన మూడేళ్లుగా సహకార రంగంలో రైతుల రుణాలపై ఇవ్వాల్సిన సుమారు రూ.90 కోట్ల రాయితీ విడుదల చేయకుండా సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. శుక్రవారం(మార్చి 31)తో ఆర్థిక సంవత్సరం ముగిసినా ఈ ఏడాది రాయితీ విడుదల కోసం ఎటువంటి జీఓ విడుదల కాలేదు. ఈ రకంగా గడచిన మూడేళ్లుగా సర్కార్ సహకార రైతులను రాయితీ పేరుతో దగా చేస్తోందని రైతు ప్రతినిధులు మండిపడుతున్నారు. ఏ రుణాలపైనా రాయితీ ఇవ్వక... సహకార సంఘాల్లో తీసుకున్న స్వల్ప కాలిక రుణాలపైనే కాకుండా దీర్ఘకాలిక రుణాలపై ఆరు శాతం వడ్డీ రాయితీ కూడా విడుదల చేయడం లేదు. ప్రభుత్వ నిర్వాకంతో సహకార సంఘాలు ఆర్థికంగా పతనం వైపు పయనిస్తున్నాయి. సవాలక్ష కారణాలతో జిల్లాలోని 297 సహకార సంఘాల్లో 70 శాతం సంఘాలు ఆర్థిక నిల్వలు తరిగిపోయాయి. 2013లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జీరో పర్సంట్ వడ్డీ రాయితీకి జీవో నెం.270 జారీ అయింది. ఆ తరువాత ఏడాది కూడా అదే జీవోతో వడ్డీ రాయితీని కొనసాగించింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సహకార రాయితీలకు గ్రహణం పట్టుకుంది. రాయితీల అమలును ప్రభుత్వం గాలికొదిలేసి రైతులను నడిసంద్రంలో ముంచేసింది. ప్రభుత్వం విడుదల చేస్తుందనే నమ్మకంతో మెజార్టీ సహకార సంఘాలు రైతులకు రుణాలు ఇచ్చి వడ్డీ రాయితీలను తను సొంత నిధులతో అమలు చేస్తూ వస్తున్నాయి. ఆ తరువాత ప్రభుత్వం ఆ మేరకు రాయితీ సొమ్ము జమచేయడం సా«ధారణంగా జరిగేదే. బాబు గద్దెనెక్కాక రాయితీలను రైతులకు సహకార సంఘాలు అమలు చేస్తున్నా సంఘాల ఖాతాల్లో రాయితీ నిధులు ప్రభుత్వం జమ చేయకపోవటంతో సంఘాలు ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలోని 297 సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రెండున్నర నుంచి మూడు లక్షల మంది రైతులకు సుమారు రూ.90 కోట్ల రాయితీలు అందినా... ఆ మేర నిధులను ప్రభుత్వం తిరిగి సంఘాలకు జమ చేయలేదు. గత మూడేళ్ల రాయితీల బకాయిలు రూ.90 కోట్లు స్వల్ప కాలిక రుణాలపై ఇస్తున్న జీరోపర్సంట్ వడ్డీ రాయితీలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చే 4 శాతం వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3 శాతం రాయితీలు 2014 నుంచి విడుదల కావడం లేదు. ఇలా రాయితీల బకాయిలు గడచిన మూడేళ్ల నుంచి జిల్లాలో రూ.75 కోట్లు, దీర్ఘ కాలిక రుణాలపై ఆరు శాతం వడ్డీ రాయితీ రూ.15 కోట్లు కూడా సహకార సంఘాలకు జమ కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది జీరో పర్సంట్ వడ్డీ రాయితీ అమలు చేస్తుందా లేదా అనే అంశంపై ఇంతవరకు స్పష్టత లేదు. ఆర్థిక సంవత్సరం శుక్రవారం (మార్చి 31) ముగిసినా చంద్రబాబు సర్కార్‌లో కనీస స్పందన లేకపోవడంతో జీరో పర్సంట్ వడ్డీ రాయితీకి మంగళంపాడినట్టేనా అని రైతులు అనుమానపడుతున్నారు. రాయితీ విడుదల చేయకుంటే జిల్లాలో రైతులు, సహకార సంఘాలు తీవ్రంగా నష్టపోతారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సహకార వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2015–16లో పంట రుణాలు రూ.వెయ్యి 62 కోట్లు మంజూరు చేశారు. రుణాలు సకాలంలో జమ చేసిన లక్షా 66 వేల మంది రైతులు, దీర్ఘకాలిక రుణాలు సకాలంలో చెల్లించిన 66 వేల మంది రైతులకు వడ్డీ రాయితీ ఇంతవరకు మంజూరు కాలేదు. 2016–17లో 54 వేల మంది రైతులకు స్వల్పకాలిక రుణాలు రూ.305 కోట్లు పంపిణీ చేశారు. 60 వేల మంది రైతులకు రూ.180 కోట్లు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేశారు.అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమస్య తీవ్రతను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు. ఇదేమి బరితెగింపు రైతులకు రుణ మాఫీ అమలు చేయడంతో వడ్డీ రాయితీలు అవసరం లేదన్న ధోరణిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నీటిమూటతో రుణమాఫీ అరకొరగా చేశారు. కానీ పూర్తిగా రుణమాఫీ చేసినట్టు చెప్పుకుంటూ రాయితీలకు మంగళం పాడేందుకు తెగబడటం ఎంత వరకు సమంజసమని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వడ్డీ రాయితీ భరించి రైతులకు అమలు చేసి తిరిగి ఆ నిధుల జమ కోసం ఎదురు చూస్తున్న సంఘాలకు ప్రభుత్వం మొండి చేయిచూపితే సంఘాల భవితవ్యం ఏమిటని పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కోట్లలో వడ్డీ రాయితీ సంఘాలు, రైతులకు జమకాకున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెదవివిప్పడం లేదు. ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్దకు వెళ్లి ధైర్యంగా ఈ సమస్యను వివరించి రాయితీ నిధులు విడుదల చేయించటంలో చేతులెత్తేశారు. సీఎంపై ఒత్తిడి తెస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని కొందరు సహకార అధికారులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ రాయితీ ఎత్తేస్తారేమో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రం మొత్తానికి వడ్డీ లేని రుణాలకు రూ.172 కోట్లు, పావలా వడ్డీకి రూ.5 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రం మొత్తానికి కేటాయించిన వడ్డీ రాయితీ మన జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రూ.90 కోట్లకుపోగా మరొక జిల్లాకు కూడా సరిపోదు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇటీవల జిల్లాకు కేవలం రూ.9 కోట్లు కేటాయించి చేతులుదులుపేసుకుంది. అది ఏ మూలకు వస్తుంది. భవిష్యత్‌లో వడ్డీ రాయితీని ఎత్తేసే ఎత్తుగడ ఉన్నట్టుగా కనిపిస్తోంది. – జున్నూరి బాబి, డీసీసీబీ మాజీ డైరెక్టర్, అల్లవరం. -
అంతా బూటకమే
ఓ వైపు చంద్రబాబు రైతు సాధికారత సదస్సులు పెట్టి రుణమాఫీ పత్రాలు అందజేస్తుంటే ఇంకోవైపు రైతులు అదంతా పచ్చి బూటకమంటూ కన్నెర్ర చేస్తున్నారు. సీఎం జిల్లాలో ఉన్న సమయంలోనే బ్యాంకులను ముట్టడించి సంబంధిత అధికారులను నిలదీసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు, పర్చూరు, మండలాలతోపాటు త్రిపురాంతకంలోనూ నిరసన గళాలు వినిపించాయి. యర్రగొండపాలెం: ఎన్నికల ముందు బూటకపు వాగ్దా నాలు చేసి టీడీపీ అధినేత చంద్రబాబు గద్దెనెక్కారని ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు విమర్శించారు. రైతుల రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం త్రిపురాంతకం మండలం దూపాడులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు ఎదుట రైతులు ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన తొలి సంతకం రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల రద్దు ఫైలుపై సంతకం చేశానన్నారు. అప్పటి నుంచి ఆరు నెలలపాటు రోజుకో ప్రకటన చేస్తూ రైతులను మోసం చేశారన్నారు. రూ.50 వేలలోపు రుణాలు ఏకమొత్తంలో రద్దు పరుస్తున్నామని, ఆ పైబడిన రుణాలు విడతలవారీగా రద్దు చేస్తామని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీకి సంబంధించి రైతు సాధికారిత కార్యక్రమాల్లో తప్పుడు పత్రాలు అందజేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఉద్యానవన పంటలకు రుణమాఫీ లేదంటూ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని పేరుతో పచ్చటి పొలాలను లాక్కోటానికి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారన్నారు. దొనకొండలో 60 వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాదని, జిల్లాకు సాగర్‌నీరు సక్రమంగా రావడం లేదని, ఈ విషయం తెలిసిన అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు తమకు ఏమీ పట్టనట్లున్నారని దుయ్యబట్టారు. ఈ ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దపోతు చంద్రమౌళి రెడ్డి, నియోజకవర్గం అధికార ప్రతినిధి నర్రా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి, నాయకులు దగ్గుల వేణుగోపాలరెడ్డి, ఆళ్ల కృష్టారెడ్డి, పోలిరెడ్డి, ఒంటేరు రాజయ్య, లక్ష్మీబాయి, జి.నాసర్‌రెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి, పీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.