పవర్ఫుల్ లేడీస్ లిస్టులో ఆ ముగ్గురు
న్యూయార్క్ : ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ అధినేత చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ ఈ ముగ్గురు బ్యాంకర్లు ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫార్చ్యూన్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో చోటుదక్కించుకున్నారు. అమెరికాకు బయట దేశాలను ఆధారంగా చేసుకుని 50 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్ రూపొందించింది. ఈ జాబితాలో బ్యాంకో స్యాన్టాన్డర్స్ అధినేత అన బోటిన్ మొదటి స్థానంలో నిలిచారు. ఆర్థికపరంగా, రాజకీయ పరంగా ఎలాంటి ఒడిదుడుకులు నెలకొన్నా ఎల్లప్పుడూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగే, యూరోజోన్‌లో అతిపెద్ద బ్యాంకు బ్యాంకో స్యాన్టాన్డర్స్కు బోటిన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ లిస్టులో భట్టాచార్య రెండో స్థానంలో నిలవగా.. కొచ్చర్ 5వ స్థానం, శర్మ 19 స్థానాన్ని దక్కించుకున్నారు.
భారత్‌లోని అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐకు మూడేళ్లు చీఫ్‌గా నిర్వర్తించిన క్రమంలో భట్టాచార్య ప్రొపైల్ పెరిగిందని ఫార్చ్యూన్ పేర్కొంది. రఘురామ్ రాజన్ అనంతరం ఆర్బీఐ గవర్నర్‌గా భట్టాచార్యను నియమిస్తారనే వార్తలు ఓ దశలో ఊపందుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఐదు అనుబంధ సంస్థలతో పాటు భారతీయ మహిళ బ్యాంకును ఎస్బీఐలో విలీనం చేసుకునే ప్రతిపాదన కూడా ఆమెనే తీసుకోవడం విశేషం. ప్రైవేట్ రంగ బ్యాంకులో అతిపెద్దదైన ఐసీఐసీఐకు కొచ్చర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, ప్రత్యర్థి బ్యాంకులు ఆమెను ఓ అద్భుతమైన మహిళగా భావిస్తారని ఫార్చ్యూన్ పేర్కొంది. బ్యాంకు డిజిటల్ వృద్ధిని పెంచడానికి, మహిళా ఉద్యోగులు ఓ ఏడాది ఇంటినుంచే పనిచేసుకునే అవకాశం వంటి వాటికి బాగా కృషిచేసినట్టు తెలిపింది. దేశీయంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న యాక్సిస్ బ్యాంకుకు శిఖా శర్మ సీఈవోగా ఉన్నారు. మొండిబకాయిలతో యాక్సిస్‌కు ఇబ్బందులున్నా, శర్మ వాటిని అధిగమించడానికి అన్నీ చర్యలు చేపట్టినట్టు ఫార్చ్యూన్ పేర్కొంది.