క్రమశిక్షణతో ముందడుగు
సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్
మచిలీపట్నం: విద్యార్థి దశలో క్రమశిక్షణ అలవరుచుకుంటే ఉన్నత స్థానానికి ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుందని సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సెంట్రల్ బోర్డు ఆఫ్ డెరైక్ట్ టాక్సెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చైర్మన్ కేవీ చౌదరి అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హిందూ కళాశాల ఆడిటోరియంలో వారిద్దరినీ సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తామిద్దరం హిం దూ కళాశాలలోనే చదువుకున్నామన్నారు. అప్ప ట్లో పాఠ్యాంశాలు బోధించిన రామచంద్రశాస్త్రి, వైజేఎల్ లక్ష్మణస్వామి, ఎం.హనుమంతరావు తదితర ఉపాధ్యాయుల ప్రభావం తమపై ఎంతగానో పడిందన్నారు. హిందూ హైస్కూల్, కళాశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు, అధ్యాపకు లు తమకు విద్యతో పాటు మంచి నడవడికను నేర్పారన్నారు. విద్యార్థులు కష్టపడేతత్వంతో పాటు క్రమశిక్షణ అలవరుచుకుని ముందడుగు వేయాలని సూచించారు.
కార్యక్రమంలో బంద రు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్, చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు మండలి బుద్ధప్రసాద్, హిందూ అనుబంధ సంస్థల కార్యదర్శి దైతా రామచంద్రశాస్త్రి, కృష్ణా యూనివర్సిటీ వీసీ వున్నం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కేవీ చౌదరి దంపతులను పట్టణ ప్రముఖులు ఘనంగా సత్కరించారు.