మంత్రి ఈటలకు తప్పిన ప్రమాదం
హుజూరాబాద్ టౌన్/శంకరపట్నం: రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సోమవారం ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ అనుబంధ గ్రామం మాలపల్లి వద్ద రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఈటల రాజేందర్ తదితరులు మిషన్‌కాకతీయ పనుల ప్రారంభానికి బయలుదేరారు.
అయితే మంత్రి ఎప్పుడూ ప్రయాణించే బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో కాకుండా ఎంపీ వినోద్‌కుమార్‌కు చెందిన ఫార్చునర్‌లో ఎక్కారు. మంత్రి, ఎంపీ ప్రయాణిస్తున్న ఫార్చునర్ వెనుక కాన్వాయిలో బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం ఉండగా, శంకరపట్నం మండలం ఎరుకలగూడెం-మెట్పల్లి గ్రామాల మధ్య బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనంకు సడెన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టును బలంగా ఢీకొంది. దీంతో వాహనం ముందు బ్యానెట్ భాగం దెబ్బతినడంతో ఆ వాహనాన్ని ప్రమాద సంఘటన వద్దనే వదిలి వెళ్లారు.