నాలుగు ఎఫ్ఐఆర్లు.. ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్
బన్నప్ప మృతి, ఠాణాపై దాడి ఘటనపై కమిషనర్ సీరియస్
కంటోన్మెంట్: సికింద్రాబాద్ మారేడ్‌పల్లి పోలీసు స్టేషన్‌పై సోమవారం రాత్రి జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఇద్దరు ఎస్ఐలపై పోలీసు ఉన్నతాధికారులు వేటువేశారు. మారేడుపల్లిలో ఆదివారం రాత్రి బన్నప్పను అదుపులోకి తీసుకున్న ఇద్దరు ఎస్సైలు బాధ్యతారహితంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఎస్సైలు రవికుమార్, మధులను హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. సోమవారం రాత్రి బన్నప్ప బంధువులు, మహాత్మాగాంధీ నగర్ వాసులు పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడి స్టేషన్‌కు నిప్పంటించిన సంగతి తెలిసిందే.
పోలీసులు కొట్టడం వలే బన్నప్ప మృతి చెందాడని, అతడి బంధువులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్న బన్నప్పను పోలీసులు వదిలిపెట్టకుండా మరుసటి రోజు బెయిలుపై వదిలేయడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీస్‌స్టేషన్‌లో బన్నప్పను ఉంచినందుకు ఎస్సైలపై వేటు పడినట్టుగా సమాచారం. ఇదిలా ఉండగా, మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌పై సోమవారం రాత్రి దాడికి పాల్పడి కీలకమైన ఫైళ్లతోపాటు పోలీస్‌స్టేషన్ ధ్వంసానికి పాల్పడిన వారిపై పోలీసులు నాలుగు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. దాడి ఘటనలో సుమారు 100 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని గుర్తించేందుకు పోలీస్‌స్టేషన్ దగ్గరున్న సీసీకెమెరాల డేటాను పరిశీలించి, కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.