నలుగురు కాశ్మీర్ విద్యార్థులను చితక్కొట్టారు
జైపూర్: మరోసారి బీఫ్ వివాదం వెలుగుచూసింది. తమ వసతి గృహంలో బీఫ్ వండుకొని తింటున్నారని వదంతులు వ్యాపించడంతో నలుగురు కశ్మీర్ విద్యార్థులపై దాడి జరిగిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని చిత్తోర్ గఢ్ లోగల మెవార్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న నలుగురు కశ్మీర్ విద్యార్థులు ఉన్నారు.
వారు సోమవారం సాయంత్రం గొడ్డుమాంసం తమ వసతి గృహంలో వండుకుంటున్నారని తెలియడంతో కొంతమంది హిందు కార్యకర్తలు నినాదాలతో అక్కడికి వచ్చి వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయం పోలీసులకు తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. అనంతరం వారు వండిన మాంసాన్ని ఫొరెన్సిక్ టెస్ట్ కోసం పంపించారు.
దీనిపై వర్సిటీ యాజమాన్యం స్పందిస్తూ 'మా విశ్వవిద్యాలయంలో దాదాపు 23 రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు. ఇదొక మినీ భారత్ లాంటిది. కొన్నిసార్లు చిన్నచిన్న ఘటనలు జరగడం సాధారణం. ఎందుకంటే ఇక్కడికొచ్చిన విద్యార్థులవి భిన్న అలవాట్లు భిన్న సంస్కృతులు' అని చెప్పారు.