four line
-
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
- హైవేల అభివృద్ధిపై కలెక్టర్ - సంబంధిత అధికారులతో సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నుంచి దోర్నాల, అనంతపురం నుంచి గిద్దలూరు వరకు రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. ఇందుకు సంబంధించి కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం హైవే అథారిటీ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల వరకు ఎన్హెచ్-340సీ, అనంతపురం నుంచి కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లి, గోస్పాడు, శిరువెల్ల, మహానంది, నంద్యాల మీదుగా గిద్దలూరు వరకు ఎన్హెచ్- 544డీ నెంబరుతో నాలుగు లైన్ల రోడ్డు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనలకు తగిన మార్పులు చేర్పులు చేయాలన్నారు. బైపాస్ రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు నుంచి గార్గేయపురం, బ్రాహ్మణకొట్కూరు, నందికొట్కూరు, ఆత్మకూరుకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతపురం నుంచి గిద్దలూరు, కర్నూలు నుంచి దోర్నాల వరకు ఎన్హెచ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూములపై గతంలో ఉన్న ప్రతిపాదనలనే పరిశీలించాలని సూచించారు. అలైన్మెంటు ప్రతిపాదనల్లో విద్యుత్ లైన్లు, ఆర్డబ్ల్యూఎస్ పైప్లైన్లను చేర్చాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, డీఆర్ఓ గంగాధర్గౌడు, నేషనల్ హైవే పీడీ చంద్రశేఖర్రెడ్డి, ఆర్ అండ్బీ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబు, నంద్యాల, ఆత్మకూరు డీఎఫ్ఓలు శివప్రసాద్, సెల్వమ్, నంద్యాల ఆర్డీఓ రాంసుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదిలోనే అడ్డంకులు!
కర్నూలు-మార్కాపురం జాతీయ రహదారిలో మార్పులు? - అటవీ భూముల సేకరణకు లభించని అనుమతి - జిల్లాలో నాలుగు లైన్ల రెండు జాతీయ రహదారుల నిర్మాణం - మొత్తం 29.8 కిలోమీటర్ల అటవీ భూములు అవసరం - ఇప్పటికీ ప్రారంభం కాని సర్వే పనులు అనంతపురం-అమరావతి, కర్నూలు-మార్కాపురం రహదారుల నిర్మాణానికి ఆదిలోని అవాంతరం ఎదురయింది. అటవీ శాఖ భూములు ఇచ్చేందుకు పర్యావరణ శాఖ అనుమతివ్వకపోవడంతో రహదారిలో మార్పులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల ఈ నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ జాతీయ రహదారులకు కేంద్రం పచ్చజెండా ఊపినా.. తాజా వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుంది. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో రెండు నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 150 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి 1,713 హెక్టార్ల ప్రభుత్వ, ప్రైవేట్ భూమలతో పాటు అటవీ భూమి అవసరం అవుతుంది. ఇందులో 29.8 కిలోమీటర్ల అటవీ భూముల్లో రహదారుల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే కేంద్ర పర్యావరణ అటవీశాఖ ఈ భూములను ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో రహదారుల అలైన్మెంట్లో మార్పులు తప్పనిసరి కావచ్చని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు జాతీయ రహదారి 44 వెంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్కు కర్నూలు జిల్లా వాసులు మూడు, నాలుగు గంటల్లో చేరుకునేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని అమరావతికి వెళ్లాలంటే సరైన రహదారులు లేకపోవడంతో 8–10 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీమ జిల్లాల నుంచి అమరావతికి కొత్తగా నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అనంతపురం నుంచి కడప.. కర్నూలు, ప్రకాశం జిల్లా మీదుగా అమరావతికి ఈ రహదారి చేరుకుంటుంది. ఎక్కడా మలుపులు లేకుండా రహదారి నిర్మించాలనేది ప్రణాళిక. అలాగే అనంతపురం–అమరావతి రహదారికి అనుసంధానంగా కర్నూలు–మార్కాపురం జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఈ రెండు రహదారులు మార్కాపురం వద్ద అనుసంధానమై అక్కడి నుంచి ఆరు లైన్లుగా అమరావతికి సాగిపోతాయి. ఈ రహదారులు వినియోగంలోకి వస్తే సీమ జిల్లాల నుంచి రాజధాని అమరావతికి నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. అనుమతికి కేంద్ర పర్యావరణ అటవీశాఖ నిరాకరణ అనంతపురం–అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి జిల్లాలో 71.60 కిలోమీటర్ల వెళ్తుంది. ఈ రహదారి జిల్లాలో కొలిమిగుండ్ల మండలం బుగ్గ వద్ద ప్రవేశించి సంజామల, ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల మీదుగా సాగుతుంది. ఇందులో రుద్రవరం మండలంలో 14 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులకు అటవీ భూములు అవసరం కానున్నాయి. అలాగే కర్నూలు నుంచి మార్కాపురం వరకు కొనసాగే జాతీయ రహదారి కర్నూలు, మిడ్తూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, వెలుగోడు మండలాల మీదుగా 78.60 కిలోమీటర్లు సాగుతుంది. ఇందులో వెలుగోడు మండలంలో 15 కిలోమీటర్ల అటవీ భూముల్లో రహదారి నిర్మించాల్సి ఉంది. రెండు రహదారుల్లో మొత్తం 29.8 కిలోమీటర్లు సాగే జాతీయ రహదారులకు అటవీ భూములను ఇచ్చేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో రెండు రహదారుల అలైన్మెంట్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కర్నూలు–మార్కాపురం రహదారి అలైన్మెంట్లో మార్పు తప్పనిసరి అని తెలుస్తోంది. ప్రారంభం కాని సర్వే పనులు అనంతపురం–అమరావతి జాతీయ రహదారి మొత్తం 598 కిలోమీటర్లు సాగుతుంది. ఇందులో కర్నూలు ఫీడర్కు సంబంధించి రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి మొత్తం 1713 హెక్టార్ల భూమి అవసరం. రూ.7,139 కోట్లతో రెండున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంతవరకు సర్వే పనులు కూడా పూర్తి కాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలి. దీనికి తోడు అటవీ భూములను రహదారుల నిర్మాణానికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వకపోవడం అయోమయానికి గురిచేస్తోంది. అటవీ భూములు ఇచ్చేందుకు అనుమతి నిరాకరణ జిల్లాలో వెళ్తున్న అనంతపురం–అమరావతి, కర్నూలు–మార్కాపురం జాతీయ రహదారుల నిర్మాణానికి అటవీ భూములను ఇచ్చేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి నిరాకరించింది. ఈ కారణంగా అలైన్మెంట్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. రెండు రహదారుల్లో 29.8 కిలోమీటర్ల మేర అటవీ భూములు ఉన్నాయి. – నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్