ఒకదాని వెనుక ఒకటి..
రెండు కార్లు, డీసీఎం, ఆర్టీసీ బస్సు ఢీ..
వృద్ధ దంపతులకు స్వల్ప గాయాలు
వర్గల్ : ఒకే మార్గంలో వెళుతున్న నాలుగు వాహనాలు ప్రమాదవశాత్తు ఒక దానిని మరొకటి ఢీకొన్న సంఘటన సోమవారం మండలంలోని గౌరారం స్టేజీ వద్ద జరిగింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు వృద్ధ దంపతులు స్వల్పంగా గాయపడ్డారు. గౌరారం పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ రవీందర్ రాజు కథనం మేరకు.. పాములపర్తి వైపు నుంచి కూరగాయల లోడ్‌తో హైదరాబాద్ వైపు డీసీఎం వెళుతోంది. గౌరారం స్టేజీ వద్ద రోడ్డు పక్క నుంచి అదే మార్గంలో వెలుతున్న కారు అకస్మాత్తుగా కుడి వైపునకు వచ్చి డీసీఎంను పక్కనుంచి తాకింది. దీంతో డీసీఎం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.
ఈ క్రమంలో దాని వెనకాలే వస్తున్న వేములవాడ ఆర్టీసీ బస్సు డీసీఎం ఢీకొంది. ఆ వెనకాలే వస్తున్న మరో కారు ఆర్టీసీ బస్సును తాకింది. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం కాగా ఇతర వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో సిరిసిల్లకు చెందిన వృద్ధ దంపతులు రామస్వామి (80), హనుమవ్వ (75)లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక క్లినిక్‌లో వారి కి ప్రాథమిక చికిత్స చేయించారు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్హెచ్ఓ రవీందర్‌రాజు తెలిపారు. కాగా ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.