ఏడాది పిల్లాడు హత్య చేశాడట..!
కైరో: ఏడాది వయసున్న పిల్లాడు హత్యాయత్నం, హత్య చేశాడట.. అంతేనా ఆస్తులను ధ్వంసం చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడు. పోలీసు అధికారులను కూడా బెదిరించాడు. వినడానికి వింతగా ఉన్నా ఈజిప్టు మిలటరీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అహ్మద్ మన్సూర్ కొరాని (ప్రస్తుత వయసు నాలుగేళ్లు) అనే బాలుడ్ని దోషిగా నిర్ధారిస్తూ జీవిత శిక్ష విధించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో పొరపాటు జరిగిందంటూ ఈజిప్ట్ అధికారులు లెంపలేసుకున్నారు.
బాలుడి తండ్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమకు అన్యాయం జరిగిందంటూ గుండెలు బాదుకున్నాడు. తన కొడుకును తన వద్ద నుంచి తీసుకెళ్లవద్దని, న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు. 'నేను పేదవాడిని. నిస్సహాయుడిని. ఎవరికీ హాని చేయలేదు. నా కొడుకును నా వద్ద నుంచి తీసుకెళ్లవద్దు' అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వార్త వెలుగులోకి వచ్చాక ఈజిప్టు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. డిఫెన్స్ న్యాయవాది మహ్మద్ అబు కఫ్ మాట్లాడుతూ.. కొరాని నేరం చేయలేదని నిరూపించడానికి అతని బర్త్ సర్టిఫికెట్‌ను సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టామని, అయితే జడ్జిలు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.
కొరాని తండ్రి ఇంటర్వ్యూ ప్రసారమైన మరుసటి రోజు మిలటరీ ప్రతినిధి మాట్లాడుతూ.. తప్పు జరిగినట్టు అంగీకరించారు. బాలుడి పేరును పొరపాటుగా నిందితుల జాబితాలో చేర్చినట్టు చెప్పారు. మూడేళ్ల క్రితం కైరోకు 70 కిలో మీటర్ల దూరంలోని ఫయోమ్ ప్రావిన్స్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి 116 మందిని నిందితులుగా చేర్చారు. ఆ సమయంలో బాలుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి నాలుగు నెలలు కస్టడీలో ఉంచారు. ఆ తర్వాత కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది.