పిల్లాడు రిమోట్ నొక్కి నలుగురిని పేల్చేశాడు!
నాలుగేళ్ల బాలుడు.. దూరంగా కారులో నలుగురు వ్యక్తులు.. బాలుడి చేతిలో రిమోట్. కారులోని వ్యక్తుల కళ్లలో ప్రాణభయం.. క్షణాలు లెక్కిస్తూ.. ఉన్నారు. బాలుడు ఒక్కసారిగా రిమోట్ నొక్కాడు. పెద్దపెట్టున శబ్దం చేస్తూ.. భారీగా మంటలు చిమ్ముతూ కారు తునాతునకలు అయింది. నలుగురు వ్యక్తులు కాలిబూడిదయ్యారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపు సాగిస్తున్న హత్యాకాండలో తాజా దుర్మార్గమిది. 'జిహాద్ జూనియర్'గా పేరొందిన నాలుగేళ్ల బ్రిటిష్ పిల్లాడు కారులోని నలుగురు వ్యక్తులను బాంబుతో పేల్చేసిన వీడియోను ఐఎస్ఐఎస్ తాజాగా విడుదల చేసింది. ఈ పిల్లాడి పేరు ఇసా దార్. ముస్లిం మతంలోకి మారిన ఈశాన్య లండన్‌కు చెందిన గ్రేస్ ఖాదిజా దార్ కొడుకు అతను.
తాజా వీడియోలో ఇస్లామిక్ ఆర్మీ దుస్తులు వేసుకొని.. తలకు ఐఎస్ఐఎస్ ప్రతీక ఉన్న రుమాలును కట్టుకొని అతను కనిపించాడు. తమకు బందీలుగా చిక్కిన నలుగురు వ్యక్తుల్నీ దూరంగా కారులో బంధించారు. కారుకు దూరంగా ఉన్న పిల్లాడు తన చేతుల్లోని రిమోట్ బటన్‌ను నొక్కడం ద్వారా కారును పేల్చేయడంతో అందులోని నలుగురు కాలిబూడిదయ్యారు. కారు పేలడంతోనే ఆ చిన్నారి 'అల్లాహు అక్బర్' అంటూ విజయకేక వేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. గతంలోనూ ఓ సారి ఈ బాలుడు ఐఎస్ఐఎస్ వీడియోలో కనిపించాడు. మూడేళ్ల కిందట అతని తల్లి చిన్నారిని సిరియా తీసుకెళ్లింది. అప్పటినుంచి ఈ చిన్నారికి ఉగ్రవాద భావజాలం నూరిపోస్తున్నట్టు తాజా వీడియో స్పష్టం చేస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు.
'వాళ్లు శత్రువులు, వాళ్లతో జాగ్రత్త' పేరిట ఉన్న ఈ వీడియోను ఐఎస్ఐఎస్ రాజధాని రక్కాలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో కనిపించిన నలుగురు వ్యక్తులు చివరి ఘడియాల్లో అత్యంత బలహీనంగా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కనిపించారు. వారున్న కారును బాంబుతో పేల్చేయడానికి ముందు 'అవిశ్వాసులను మేం చంపేయబోతున్నాం' అని బాలుడు అనడం ఈ వీడియోలో వినిపిస్తుంది. విదేశీ గూఢచారులు అన్న అనుమానంతో ఈ నలుగురిని ఐఎస్ఐఎస్ కిరాతకంగా హతమార్చింది.