విజేందర్ నాల్గో బౌట్ వాయిదా
మాంచెస్టర్: ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో వరుసగా మూడు విజయాలు సాధించి దూసుకుపోతున్న భారత బాక్సర్ విజేందర్ సింగ్ నాల్గో బౌట్ ఆకస్మికంగా వాయిదా పడింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం డబ్యూబీవో వరల్డ్ లైట్ వెయిట్ చాంపియన్ టెర్రీ ఫ్లానాగాన్-విజేందర్ల మధ్య నాల్గో బౌట్ ఫిబ్రవరి 23 వ తేదీన జరగాల్సి ఉంది.
కాగా, వరల్డ్ టైటిల్ పోరులో భాగంగా డెర్రీ మాథ్యూస్ తలపడిన మ్యాచ్ లో టెర్రీ ఫ్లానాగాన్ గాయపడ్డాడు. దీంతో ఆ బౌట్ ను మార్చి 12కు వాయిదా వేశారు. దీనిపై విజేందర్ మాట్లాడుతూ.. నాల్గో బౌట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు. బౌట్ అర్థాంతరంగా వాయిదా పడటంతో నిరాశ చెందినట్లు పేర్కొన్నాడు. ఆ బౌట్ లో కూడా విజయం సాధించాలనే కసితో ఉన్న తాను ప్రస్తుతం తీవ్రమైన ప్రాక్టీస్ లో నిమగ్నమైనట్లు పేర్కొన్నాడు.