ఏసీబీ వలలో ఎస్ఐ
కేసు విత్‌డ్రాకు రూ.40 వేల డిమాండ్
రూ.22 వేలు తీసుకుంటుండగా పట్టివేత
అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు
సీతంపేట (విశాఖపట్నం): అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసు అధికారి లంచగొండిగా మారాడు. ఉద్యోగ బాధ్యతగా నిర్వర్తించాల్సిన పనికి లంచం డిమాండ్ చేశాడు. ఫలితంగా అవినీతి నిరోధకశాఖకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఫోర్త్ టౌన్ ఫోలీస్స్టేషన్లో లాఅండ్ఆర్డర్ ఎస్ఐగా పనిచేస్తున్న రమేష్‌బాబు తన కేబిన్‌లో ఆదివారం మధ్యాహ్నం ఒక వ్యక్తి నుంచి రూ.22 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నరసింహరావు కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. నేవల్ డాక్‌యార్డులో వెల్డింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న దక్షిణామూర్తి అక్కయ్యపాలెంలోని టూ బెడ్రూమ్ ప్లాట్‌ను వెంకట రాజేశ్వరరావు అనే వ్యక్తికి రూ.22 లక్షలకు అక్టోబర్‌లో విక్రయించాడు.
ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే ఇంటిని మాత్రం అప్పగించలేదు. దక్షిణామూర్తికి తన భార్య దివ్యతో కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. వారు విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో దివ్య ఇల్లు ఖాళీ చేయలేదు. దీంతో ఇల్లు అప్పగించలేదని రాజేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దక్షిణామూర్తిపై 420, 448 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ఎస్ఐ రమేష్‌బాబు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణామూర్తి తన భార్య దివ్యకు రూ. 5లక్షలు చెల్లించి గొడవ సెటిల్ చేసుకున్నాడు. ఇంటిని రాజేశ్వరరావుకు అప్పగించాడు. సమస్య పరిష్కారమైనందున మెగా లోక్ అదాలత్‌లో కేసు విత్‌డ్రా చేసుకుంటామని దక్షిణామూర్తి ఎస్ఐ రమేష్‌బాబును కలిశాడు. ఇందుకోసం ఎస్ఐ రూ.40 వేల లంచం డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే రిమాండుకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడటంతో రూ.22 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో స్టేషన్‌లోని ఎస్ఐ కేబిన్‌లో దక్షిణామూర్తి నుంచి రమేష్‌బాబు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఎస్ఐను ఆరెస్టు చేశారు.
పోలీసు అధికారుల్లో గుబులు...
ఎస్ఐ స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడటంతో పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎస్ఐ రమేష్‌బాబు హఠాత్తుగా పట్టుబడటంతో ఉన్నతాధికారులు, సిబ్బంది నిర్ఘాంతపోయారు. ఆర్థికపరమైన కేసుల్లో సిబ్బంది, అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్ఐ బెదిరించారు
ఎస్ఐ చర్యలకు విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించాను. కుటుంబ కలహాలు సెటిల్ చేసుకుని, కొనుగోలు చేసిన వ్యక్తికి ఇల్లు అప్పగించాను. లోక్ అదాలత్‌లో కేసు విత్‌డ్రా చేయడానికి ఎస్ఐ రూ.40 వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వకుంటే రిమాండ్‌కు తరలిస్తానని బెదిరించడంతో ఏసీబీని ఆశ్రయించాను.
-దక్షిణామూర్తి, ఫిర్యాదుదారుడు