వయసు 25.. సర్జరీలు 100
⇒ పాకిస్తానీ యువతికి 100వ సర్జరీ
లాహోర్: జీవితంలో ఎప్పుడో తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తేనే శస్త్రచికిత్స వరకు వెళ్తాం. సాధారణ వ్యక్తులతో పోలిస్తే సర్జరీ చేసుకున్నవారు కాస్త బలహీనంగానే ఉంటారు. అలాంటిది ఒకసారికాదు రెండుసార్లు కాదు.. ఏకంగా వందోసారి శస్త్రచికిత్స చేయించుకుంది ఓ పాకిస్తానీ యువతి. ‘అరుదైన చర్మవ్యాధితో బాధపడుతున్న ఫౌజియా యూసుఫ్‌కు 100వ శస్త్రచికిత్సను పూర్తిచేశాం. ఫిబ్రమటోసెస్గా పిలిచే ఈ సమస్య ఆమెకు చిన్నతనంలోనే ఎదురైంది. దీంతో పదే పదే సర్జరీ చేయడం మినహా మరో మార్గం లేకపోవడంతో ఇన్నిసార్లు సర్జరీ చేయాల్సి వచ్చింద’ని షేక్ జాఝెద్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ఫౌజియా మీడియాతో మాట్లాడుతూ... ‘మరిన్నిసార్లు కూడా సర్జరీ చేయించుకునేందుకు నేను సిద్ధమే. అంతే కానీ వ్యాధి కారణంగా పెరుగుతున్న నా కుడి భుజాన్ని తొలగించుకునేందుకు నేను సిద్ధంగా లేను. నా ప్రాణాలు కాపాడేందుకు భుజాన్ని తొలగించుకోవడం మేలని వైద్యులు చెప్పారు. లేదంటే వ్యాధి మెడవరకు వ్యాపిస్తుందని హెచ్చరించారు. అయినా సరే.. చావడానికైనా సిద్ధమేకానీ భుజం లేకుండా బతకలేను. ఓ వికలాంగురాలిగా బతకడం నావల్ల కాదు' అని ఫౌజియా చెప్పింది.