అప్పులబాధతో రైతు ఆత్మహత్య
హుస్నాబాద్‌రూరల్ : కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం కేశ్వాపూర్ గ్రామానికి చెందిన బొమ్మగాని సంపత్(45) అనే రైతు శనివారం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంపత్ తన ఆరెకరాల భూమిలో వ్యవసాయంతోపాటు గీతవత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. రూ.రెండు లక్షల అప్పులు చేసి రెండు బోర్లు వేయగా చుక్క నీరు రాలేదు. గత మూడు నెలల కిందట పెద్ద కూతురు వివాహనికి మరో రూ.ఆరు లక్షల వరకు అప్పులు చేశాడు. పంటల దిగుబడులు వస్తే అప్పులు తీర్చవచ్చని భావించాడు. కానీ ఖరీఫ్‌లో వేసిన పత్తి, మొక్కజొన్న పంటల్లో ఆశించిన దిగుబడులు వచ్చేలా లేకపోవడంతో మనస్తాపం చెందాడు. తన వ్యవసాయ బావి వద్దనే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంపత్‌కు భార్య రేణుక, కూతురు, కొడుకు ఉన్నారు.