కృష్ణా బోర్డు ముసాయిదా అక్రమం
కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శికి హరీశ్‌రావు ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ అక్రమమని, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్సింగ్కు మంత్రి హరీశ్‌రావు వివరించారు. మంగళవారం ఉన్నతాధికారులతో కలసి ఢిల్లీలో అమర్‌జీత్‌సింగ్‌తో హరీశ్‌రావు సమావేశమయ్యారు. కృష్ణా బోర్డు తన పరిధిని అతి క్రమించి నీటి కేటాయింపుల్లో జోక్యం చేసుకోవాలని చూస్తోందని.. ముసాయిదా నోటిఫికేషన్ ఇందుకు సాక్ష్యమన్నారు.
విభజన చట్టంలోని సెక్షన్ 85(బి), 87(1) ప్రకారం బోర్డు లేని అధికారాన్ని తీసుకుని కేటాయింపులు చేసే బాధ్యతలను తీసుకునేలా ముసాయిదా నోటిఫికేషన్ తయారు చేసిందన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినా తెలంగాణ వాదనే నెగ్గుతుందన్నారు. ఇక ఆ ముసాయిదాలోని ఏకపక్ష నిర్ణయాలను క్షుణ్ణంగా వివరించారు. అమర్జీత్సింగ్ మొత్తం ఉదంతంపై ఒక వివరణాత్మక నివేదన ఇవ్వాలని కోరగా.. రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారి ఎస్.ఎ.జోషీ మంగళవారం సాయంత్రం ఈ మేరకు లేఖను ఇచ్చినట్టు సమాచారం.
చంద్రబాబు వైఖరి సరికాదు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి మంగళవారం విమర్శించారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నానని పదేపదే చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ జిల్లాకు నీళ్లు వస్తుంటే అడ్డుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు.