'ఉద్యోగులను కొట్టడం పెద్ద నేరమేమీకాదు'
పణజి: ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటనలో ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరికీ గుర్తే! అసలు దోషుల్ని వదిలేసి తప్పంతా సదరు అధికారిదేనని మంత్రులు తీర్మానించగా, సీఎం కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినవచ్చాయి. ఏపీని ఆదర్శంగా తీసుకుందో ఏమోగానీ.. ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం, వారిపై దాడులకు దిగడం లాంటివి పెద్ద నేరమేమీకాదని గోవా ప్రభుత్వం తీర్మానించింది. ఇక్కడి లాగే అక్కడ కూడా ఓ 'అవినీతి' ఎమ్మెల్యేను కాపాడుకోవడానికే ఈ తతంగమంతా నడిచింది. తమ చర్యను సమర్థించుకుంటూ గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌడా ఇలా అన్నారు..
'ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు పెద్ద నేరమేమీకాదు. ప్రస్తుతం మనం సంస్కరణల యుగంలో ఉన్నాం. హింస కంటే సంస్కరణ ద్వారానే ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. న్యాయశాస్త్రం కూడా దీనిని సమర్థిస్తుంది. హింస లేదా శిక్షలతో సాధించేది ఏమీ ఉండదు. ఈ విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసంరం ఉంది' అంటూ పూర్తిచేశారు డిసౌజా.
ఇంతా చేసింది ఎవరికోసమంటే.. బీజేపీ మిత్రపక్షమైన గోవా వికాస్ పార్టీ ముఖ్యనేత, ఎమ్మెల్యే పచేకో కోసం. 2006లో ఓ ప్రభుత్వోద్యోగిపై చేయిచేసుకున్న పచేకో.. న్యాయస్థానంలో దోషిగా నిరూపణ కావడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అదికూడా ఆరు నెలల శిక్ష మాత్రమే. కాగా, ఎలాగైనాసరే ఆయనను జైలు నుంచి విడుదల చేయించాల్సిందేనని కంకణం కట్టుకున్న బీజేపీ ప్రభుత్వం.. పచేకో చేసింది కేవలం 'పొరపాటు మాత్రమే' అని తీర్మానించి ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది.