నేటి నుంచి తిరుమలలో ఉచిత వివాహాలు
► పురోహిత, మేళం, విద్యుత్ చార్జీల రద్దు అమల్లోకి
► కల్యాణవేదికలో వివాహాలకు త్వరలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం
సాక్షి, తిరుమల: తిరుమలలోని టీటీడీ పౌరోహిత సంఘం లో పెళ్లి చేసుకునే జంటలకు శుభవార్త. వివాహాలకు పౌరోహిత, మేళం, విద్యుత్ చార్జీలను టీటీడీ రద్దు చేసింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. పెళ్లి తం తుకు ఆర్థికభారం కలగకుండా అన్నీ ఉచితంగా సమకూరిస్తే ధార్మిక ప్రచారంతోపాటు మానవసేవకు దోహదపడుతుందని ఈవో సాంబశివరావు భావించారు. ఇందులో భాగంగా ‘కల్యాణం’ పథకం ప్రవేశపెట్టారు.
ఈ పథకం మొదటి దశలో కల్యాణవేదికలో జరిగే వివాహాలకు పురోహితుడు, మంగళ వాయిద్యాలు, పెళ్లివేడుక వీడియో, విద్యుత్ చార్జీలకు వసూలు చేసే రూ.860ని రద్దు చేశారు. భవిష్యత్తులో రెండో దశ కింద కొత్త జంటలకు శ్రీవారి కానుకగా పసుపు, కుంకుమ, అక్షింతలు, కంకణాలు అందజేయనున్నారు.కొత్త జంటలను ‘సుపథం’ ద్వారా నేరుగా రూ. 300 టికెట్ల నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కొత్త జంటలకు రూ.25 ధర కల్గిన చిన్న లడ్డూలు పది ఉచితంగా ఇస్తారు. కల్యాణవేదికలో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి త్వరలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించనున్నారు.