రిటైరైన సెక్స్‌వర్కర్లకు సర్కారీ ఇళ్లు
ఆసియాలోనే అతిపెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన కోల్‌కతాలోని సోనాగచి ప్రాంతంలో రిటైరైన సెక్స్‌వర్కర్లకు అక్కడి ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వబోతోంది. వయసైపోయిన అలనాటి సొగసుగత్తెల జీవితం దుర్భరంగా ఉంటుంది. కడు పేదరికం, వ్యాధులతో వాళ్లు కునారిల్లిపోతుంటారు. అందుకే వారికి పునరావాసం కల్పించే ఉద్దేశంలో భాగంగా ముందుగా రెండు భవనాలను నిర్మించాలని బెంగాల్ సర్కారు భావిస్తోంది. అక్కడ వారికి ఆహారం, దుస్తులు, నీడ, వైద్య సదుపాయాలు అన్నీ అందిస్తారు. వారి శేషజీవితాన్ని గౌరవప్రదంగా గడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అక్కడి మహిళా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి శశి పంజా తెలిపారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాలతో ఆమె సోనాగచి ప్రాంతంలో ఓ సర్వే చేశారు. అక్కడ దాదాపు 750 మంది వరకు వృద్ధులైన సెక్స్‌వర్కర్లు ఉన్నట్లు తేలింది. వారికి ఏమాత్రం వైద్య ఆరోగ్య సదుపాయాలు లేకపోవడంతో పాటు వారిలో చాలామంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. ఆదాయమార్గాలు ఏమీ లేకపోవడంతో భిక్షాటన తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. అందుకే వారిని ఆదుకోడానికి సర్కారు ఉచితంగా వైద్యసదుపాయాలు, హెల్త్ కార్డులు, ఉచితంగా లేదా భారీ సబ్సిడీతో రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు శశి తెలిపారు. ప్రభుత్వం కొత్తగా కట్టబోయే రెండు భవనాల్లో 200 మంది సెక్స్‌వర్కర్లకు ఆశ్రయం కల్పిస్తారు.