మెదక్ చర్చిలో ఉచిత 5జీ వైఫై
సాక్షి, మెదక్: మెదక్ చర్చిలో భక్తులు, పర్యాటకుల సౌకర్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉచిత 5జీ వైఫై సేవలను ప్రారంభించాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా చర్చిలో ఉచిత బీఎస్ఎన్ఎల్ వై ఫై ఏర్పాటు చేశారు. కలెక్టర్ భారతి హోళికేరి గురువారం ఉచిత 5జీ వైఫైని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లాను పర్యాటక కేంద్రంగా అన్ని హంగులతో అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే పర్యాటకుల కోసం చర్చిలో ఉచిత వైఫై ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఉచిత 5జీ వైఫైని ఏర్పాటు చేశామన్నారు. ఏకకాలంలో 2 వేల మంది వై ఫై వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబు, డీఆర్ఓ మెంచు నగేశ్, మెదక్ చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి విజయ్‌కుమార్, బీఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు.