స్వాతంత్య్ర సమరయోధుడు గుత్తా కన్నుమూత
* వైద్య కళాశాలకు అవయవ దానం
* నివాళులర్పించిన ప్రముఖులు
రాజేంద్రనగర్: స్వాతంత్య్ర సమరయోధుడు గుత్తా సుబ్రహ్మణ్యం (102) మంగళవారం రాజేంద్రనగర్ మండలం గంధంగూడలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఇంట్లోనే మరణించారు. ఈయన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు తాత. ఈయనకు భార్య జవహరిబాయి, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో గుత్తా క్రాంతి కుమార్తె గుత్తా జ్వాల. స్వస్థలం గుంటూరు జిల్లా. చాలా ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నారు.
ఈయన మరో కూతురు జ్యోత్స్న అవయవ దాతల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. సుబ్రహ్మణ్యం మరణించిన విషయం తెలుసుకున్న ఆయన మనవరాలు గుత్తా జ్వాలతోపాటు ఐఏఎస్ అధికారులు నీలం సహానీ దంపతులు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ఆయన భౌతికకాయాన్ని షాదాన్ వైద్య కళాశాలకు దానం చేశారు. అక్కడే ప్రముఖులంతా నివాళులర్పించారు.