రైలు చార్జీలు పెంపు... వెంటనే వెనకడుగు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ప్రయాణికులు, సరుకు రవాణా చార్జీలను పెంచుతూ రైల్వే శాఖ పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది. అయితే, అంతలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తొలుత రైల్వే శాఖ అన్ని తరగతుల ప్రయాణికుల టికెట్ చార్జీలను 10 శాతం పెంచేసింది. ఇంధన సర్దుబాటు (ఎఫ్ఏసీ) కింద మరో 4.2 శాతం భారం మోపింది. దీంతో మొత్తం 14.2 శాతం మేర చార్జీలు పెరిగాయి. అలాగే, సరుకు రవాణాపై 6.5 శాతం(ఎఫ్ఏసీతో కలుపుకుని) పెంచింది. పెరిగిన చార్జీలు ఈ నెల 20 నుంచి అమల్లోకి రానున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఎన్నికల ఫలితాల రోజు చార్జీలను పెంచడంపై విమర్శలు వ్యక్తం కావడంతో పెంపు నిర్ణయాన్ని నూతన ప్రభుత్వానికి విడిచిపెట్టాలని రైల్వే మంత్రి మల్లికార్జునఖర్గే ఆదేశించారు.