రిటైర్మెంట్ దిశగా ప్రపంచ అపరకుబేరుడు!
ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు?.. కొన్నిరోజుల కిందటి దాకా టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఉండేవాడు. కానీ, ట్విటర్ కొనుగోలు వ్యవహారం.. దానికి తోడు టెస్లా నష్టాలతో రికార్డు స్థాయి పతనం చెంది రెండో స్థానానికి దిగజారాడు. అప్పటి నుంచి ఫ్రాన్స్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ అపరకుబేరుడిగా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే.. ఈ పెద్దాయన ఇప్పుడు రిటైర్మెంట్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తన విలాసవంతమైన వ్యాపార సామ్రాజ్యానికి వారసులను ఒక్కొక్కరిగా ప్రకటించుకుంటూ వెళ్తున్నారు బెర్నార్డ్ ఆర్నాల్ట్(73). తాజాగా కూతురు డెల్‌ఫైన్‌కు ఎల్వీఎంహెచ్ తరపున రెండో అతిపెద్ద బ్రాండ్ డియోర్ బాధ్యతలు అప్పజెప్తున్నట్లు ప్రకటించారాయన. నెల కిందట.. పెద్ద కొడుకు ఆంటోనీ ఆర్నాల్ట్‌కు వ్యాపారంలో విస్తృత బాధ్యతలు అప్పజెప్తున్నట్లు ప్రకటించారాయన. అలాగే.. బెర్నాల్ట్ ఆర్నాల్ట్‌కు ఇద్దరు భార్యల(ఒకరు మాజీ) ద్వారా మొత్తం ఐదుగురు పిల్లలు. ఆ ఐదుగురికి తన వ్యాపారాన్ని అప్పజెప్పే ప్రణాళికను ఒక్కోక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తద్వారా వ్యాపార రంగం నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
► మరేయితర కంపెనీలు, ఫ్రాంఛైజీలతో సంబంధం లేకుండా.. కేవలం ఎల్వీఎంహెచ్ వ్యాపార సామ్రాజ్యం ద్వారానే బెర్నార్డ్ ఆర్నాల్ట్.. ఆదాయం అర్జిస్తున్నారు. ప్రస్తుతం ఫోర్బ్స్ ప్రకారం ఆ విలువ 196 బిలియన్ డాలర్లు.
► యూరప్‌లోనే లగ్జరీ బ్రాండ్‌గా పేరున్న LVMH Moët Hennessy – Louis Vuitton SEకు సహ వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో బాధ్యతలు కూడా ప్రస్తుతం బెర్నాల్డ్ ఆర్నాల్ట్ నిర్వహిస్తున్నాడు.
► 1949 మార్చి 5వ తేదీన రౌబయిక్స్లో జన్మించాడు బెర్నార్డ్ జీన్ ఎటిన్నె ఆర్నాల్ట్. బార్న్ విత్ గోల్డెన్‌గా ఆర్నాల్ట్‌కు పేరుంది. తల్లిదండ్రులిద్దరూ వ్యాపార దిగ్గజాలే. అయితే.. ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసుకుని.. సొంతంగా రియల్ ఎస్టేట్ కంపెనీతో ఎదగడం ప్రారంభించాడు ఆర్నాల్ట్.
► ఆపై తండ్రి వ్యాపారాలను గమినిస్తూ, ఆయన నుంచి ఏసాయం ఆశించకుండా.. సొంత బిజినెస్‌లతో ఎదిగాడు. 80వ దశకం వచ్చేనాటికి.. సొంతంగా ఓ లగ్జరీ ఉత్పత్తుల కంపెనీ ఉండాలనే ఆలోచనలతో.. LVMH ను 1987లో నెలకొల్పాడు.
► ఏడాది తిరిగే సరికి అది బిలియన్‌న్నర డాలర్ల విలువ గల కంపెనీగా ఎదిగింది. అటుపై కంపెనీలో మేజర్ షేర్లు కొనుగోలు చేసి.. ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ బోర్డుకు చైర్మన్‌గా ఎన్నికయ్యాడు.
► 2001 నుంచి ఎల్వీఎంహెచ్ విపరీతమైన లాభాలు ఆర్జించడం మొదలుపెట్టింది. తద్వారా ఫ్రాన్స్.. యూరప్ నుంచి కాస్ట్లీ బ్రాండ్ కంపెనీగా ఎదిగింది.
► 2013లో ఫ్రాన్స్ ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. ఆ సమయంలో పన్నుల ఎగవేత కోసం ఆయన బెల్జియం పౌరసత్వం కోసం దరఖాస్తు చేశాడనే ప్రచారం తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. దరఖాస్తును వెనక్కి తీసుకున్నారాయన.
► ప్రముఖుల విమానాల కదలికలపై ట్విటర్ నిఘా వేయడంతో.. 2022లో ఆయన ప్రైవేట్ జెట్‌ను అమ్మేసినట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అద్దెకు తెచ్చుకుని, లేదంటే బిజినెస్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నాడాయన.
► తన బిడ్డలకు పాఠాలు చెప్పిన మాస్టార్‌కు కృతజ్ఞతగా.. అతని కొడుకుకు అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు ఆర్నాల్ట్. 2017లో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఈ అపర కుబేరుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌ను మద్దతు ప్రకటించారు. ఆయన తండ్రి బ్రిగిట్టే మాక్రోన్.. ఆర్నాల్ట్ పిల్లలకు పాఠాలు చెప్పేవారట.
► డెల్ఫైన్(47) ఆర్నాల్ట్ వారసుల్లో పెద్దది. పదేళ్లుగా తండ్రి వెంట ఉంటూ ఆయన వ్యాపారాలను దగ్గరగా గమనిస్తోంది. దీంతో తదుపరి బాధ్యతలు ఆమెకే అప్పగిస్తారనే చర్చ ఇప్పటి నుంచే జోరందుకుంది. అయితే..
► గత పదేళ్లలో ఆమె తీసుకున్న స్వతంత్ర నిర్ణయాలు బెడిసి కొట్టింది లేదు. సమర్థవంతమైన నిర్ణయాలకు కేరాఫ్ అనే పేరుంది ఆమెకు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి డియోర్ బాధ్యతలు స్వీకరిస్తారామె. లూయిస్ విట్టన్ వ్యాపారాన్ని సమర్థవంతంగా నడిపిస్తుండడంతో.. ఎల్‌వీఎంహెచ్‌ను కూడా ఆమె ముందకు తీసుకెళ్లగలరనే ధీమాతో బోర్డు మెంబర్స్ ఉండడం కూడా ఆమెకు కలిసొచ్చే అంశం.
► అత్యంత లగ్జరీ బ్రాండ్‌గా పేరున్న ఎల్వీఎంహెచ్(LVMH) కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి ఆర్నాల్ట్ అంత సులువుగా తప్పుకోకపోవచ్చనే వాదనా ఒకటి వినిపిస్తోంది. అందుకు కారణం కిందటి ఏడాది సీఈవో వయసు పరిమితిని ఎల్వీఎంహెచ్ ఎత్తేయడం. తద్వారా ఆర్నాల్ట్ 80 ఏళ్లు వచ్చేదాకా కూడా తన బాధ్యతల్లో కొనసాగవచ్చు. కానీ,
► అనారోగ్య కారణాల దృష్ట్యానే ఆయన బాధ్యతల నుంచి విరమణ తీసుకోవాలని భావిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తుండడం గమనార్హం.