పోలీసు చావుతో పండగ.. నాయకుడు అరెస్టు
ఫ్రాన్స్ : ఓ పోలీసు అధికారి వీర మరణాన్ని తనకు పండుగ మాదిరిగా ప్రచారం చేసిన రాజకీయ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఫ్రాన్స్‌లోని రెన్నెస్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొంతమంది పౌరులను బంధీలుగా పట్టుకున్న ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు లెఫ్టినెంట్ కల్నల్ అర్నాడ్ బెల్ట్రామే అనే అధికారి ధైర్యంగా పోరాడాడు. అయితే, ప్రమాదవశాత్తు అతడు ఉగ్రవాది తుటాకు బలై వీరమరణం పొందాడు. అతడిని వీర జవానుగా అక్కడి వారంతా పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా స్టెపనే పౌసియర్ అనే లెఫ్ట్‌వింగ్ ఫ్రెంచ్ నాయకుడు మాత్రం ట్విటర్లో భిన్నంగా స్పందించి పోలీసులకు బుక్కయ్యాడు.
‘ఎప్పుడు ఓ పోలీసు అధికారి చనిపోయినా.. అన్యాయంగా పోలీసుల చేతిలో బలైన నా స్నేహితుడు రెమి ప్రైసీ గురించే ఆలోచిస్తాను.. ఈ సారి కల్నల్ వంతొచ్చింది. గొప్ప విషయం అందుకు మరింత అదనం. ఇది మరో ఓటు తగ్గడము మాత్రమే’ అంటూ హేళనగా ఆయన ట్విటర్లో కామెంట్ చేశారు. గతంలో స్టెపనే స్నేహితుడు రెమి ప్రైసీ పోలీసుల చేతిలో చనిపోయాడు. అతడు ఒక పర్యావరణ ఉద్యమకారుడు కాగా, 2014లో ఓ డ్యామ్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేసే సమయంలో పోలీసులు ఫైరింగ్ చేసిన గ్రనేడ్ దాడిలో చనిపోయాడు. దీంతో తన మిత్రుడిని తలుచుకొని ప్రతి పోలీసు మరణం విని ఆనంద పడతానంటూ అతడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.