ఫ్రెంచ్ ఓపెన్‌కు ప్రేక్షకులు...
పారిస్: టెన్నిస్ వీరాభిమానులను ఉత్సాహపరిచేలా ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య (ఎఫ్ఎఫ్టీ) ఓ కీలక ప్రకటన చేసింది. యూఎస్ ఓపెన్ మాదిరిగా కాకుండా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎఫ్ఎఫ్టీ అధ్యక్షుడు బెర్నార్డ్ జుడిషెల్లీ గురువారం ప్రకటించారు. ‘కచ్చితంగా ఇది ప్రేక్షకులు లేకుండానైతే జరుగదు. కానీ ఎంతమంది ప్రేక్షకుల్ని ఆహ్వానించాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అధికారులతో మాట్లాడిన తర్వాతే ప్రేక్షకుల సంఖ్యపై స్పష్టత వస్తుంది. జూన్ చివర్లో గానీ జూలై ప్రారంభంలో గానీ టిక్కెట్లు అందుబాటులో ఉంచుతాం’ అని ఆయన పేర్కొన్నారు. జూన్‌లో వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్ ఇప్పుడు సెప్టెంబర్ 27నుంచి జరుగుతుంది.
ఆగస్టు 14తో సీజన్ షురూ...
కరోనా కారణంగా మార్చిలో నిలిపివేసిన ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నీల పునరుద్ధరణకు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సిద్ధమైంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ), అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్), యూఎస్ టెన్నిస్ సంఘం (యూఎస్‌టీఏ), ఎఫ్ఎఫ్టీల సహకారంతో సవరించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. రీషెడ్యూల్ ప్రకారం యూఎస్ ఓపెన్ ముందు అనుకున్నట్లుగా అగస్టు 31నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగనుండగా... ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మాత్రం వారం రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. వాషింగ్టన్ డీసీ వేదికగా ఆగస్టు 14నుంచి జరుగనున్న సిటీ ఓపెన్ ఏటీపీ 500 టూర్‌తో టెన్నిస్ సీజన్ ప్రారంభం కానుంది. అనంతరం వరుసగా ఆగస్టు 22 నుంచి వెస్ట్రన్ అండ్ సదరన్ ఓపెన్ (సిన్సినాటి వేదిక), ఆగస్టు 31 నుంచి యూఎస్ ఓపెన్ (న్యూయార్క్), సెప్టెంబర్ 8 నుంచి జనరలి ఓపెన్ (కిచ్బుహెల్), 13 నుంచి ముతువా మాడ్రిడ్ ఓపెన్ (మాడ్రిడ్), 20 నుంచి ఇంటర్నేషనల్ బీఎన్ఎల్ డి ఇటాలియా (రోమ్), 27 నుంచి రోలాండ్ గారోస్ (పారిస్) టోర్నమెంట్లు జరుగనున్నాయి.