ఎన్నెన్నో జన్మల బంధం
భాగ్యనగరంతో తనది ‘ఎన్నెన్నో జన్మలబంధం’ అంటున్నారు సుప్రసిద్ధ గాయని వాణీ జయరామ్. ైప్రెడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు అందుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. నగరంతో తనకు గల అనుబంధంపై ‘సిటీప్లస్’తో వాణీ జయరామ్ పంచుకున్న జ్ఞాపకాలు ఆమె మాటల్లోనే...
- వాణీజయరామ్
మా అన్నయ్య హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవారు. అందుకని ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండేవాళ్లం. నేను కోఠీ ఎస్బీఐలో పనిచేశా. నా పెళ్లి సికింద్రాబాద్‌లో జరిగింది. నా మనసులో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. హైదరాబాద్‌తో నాది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుంటుంది. నా అసలు పేరు కలైవాణి. జయరామ్‌తో పెళ్లి తర్వాత వాణీ జయరామ్‌గా మారాను. జయరామ్ ఉద్యోగరీత్యా ఆయనతో పాటే బాంబే వెళ్లాను. అయితే, పీబీ శ్రీనివాస్ పురస్కారం, పి.సుశీల ట్రస్టు పురస్కారం, ఫిలింఫేర్ ఫర్ సౌత్ నుంచి గత ఏడాది లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వంటి సత్కారాలను హైదరాబాద్‌లోనే అందుకున్నాను.
తెలుగులో నా పాటలన్నీ హిట్...
తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు సహా 19 భాషల్లో పాడాను. తెలుగులో నా పాటలన్నీ హిట్ అయ్యాయి. ‘శంకరాభరణం’ వంటి మహోన్నతమైన సినిమాలో పాడాను. రెండుసార్లు రాష్ట్రపతి పురస్కారం అందుకున్నాను. అయితే, నాకు తొలి హిట్ ఇచ్చింది తమిళ సాంగ్... అసలంతా దేవుడి దయ. నేను పుట్టిన పది రోజులకు మా నాన్న ఒక జ్యోతిషుడిని సంప్రదించారు. గత జన్మలో కార్తికేయునికి ఎక్కువసార్లు పంచామృతాభిషేకం చేసింది కాబట్టి, ఈ జన్మలో వాయిస్ తేనెలా ఉంటుందని, పెద్ద సింగర్ అవుతుందని అప్పుడే చెప్పారట. ఆ జ్యోతిషుడు చెప్పినట్లే జరిగింది.
తెలుగువారంటే ప్రేమ..!
ఏ రాష్ట్రంలో ఉన్నా, నాకు తెలుగు వారంటే ఎంతో ప్రేమ. ఆంధ్రా ఫుడ్ కారంగా ఉంటుంది. బాంబే, చెన్నైలలో ప్రజలు తెలుగు కల్చర్ అంటే ఇష్టపడతారు. తెలుగు గాయనీ గాయకుల్లో నాకు సుశీల, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే అభిమానం. అలాగే, ఇక్కడి వస్త్రాలంటే నాకు ఇష్టం. ముఖ్యంగా గద్వాల, చీరాల తదితర ప్రాంతాల చీరలంటే చాలా ప్రీతి.
- కోన సుధాకర్‌రెడ్డి