ప్రాణం తీసిన క్రికెట్ గొడవ
న్యూఢిల్లీ: సరదాగా ఆడుతున్న క్రికెట్ ఆట కొట్లాటకు దారితీసింది. అప్పటివరకు స్నేహితులుగా ఉన్నవారు శత్రువులుగా మారారు. ఓ యువకుడు క్షణికావేశంలో క్రికెట్ బ్యాట్ తీసుకుని స్నేహితుడి తలపై బాదగా, అతను తీవ్రంగా గాయపడి మరణించాడు. ఢిల్లీలోని సాగర్పూర్ ప్రాంతంలో ఈ విషాదకర సంఘటన జరిగింది.
మృతుడిని శివం (16)గా, నిందితుడిని ఆకాశ్ (19)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆకాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మినోరా కల్పి గ్రామంలో ఉంటున్న శివం 15 రోజుల క్రితం కుటుంబ సభ్యులు, తమ్ముడితో గడిపేందుకు ఢిల్లీకి వచ్చాడు. గత బుధవారం స్నేహితులతో కలసి క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది.
శివం స్నేహితుడు వెళ్లి జరిగిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చూడగా అప్పటికే శివం మరణించాడని అతని తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. క్రికెట్ ఆడుతూ శివం, ఆకాశ్ గొడవపడ్డారని, ఆకాశ్ బ్యాట్‌తో కొట్టగా శివం కుప్పకూలిపోయాడని వారి స్నేహితుడు అమిత్ చెప్పాడు. కాగా శివం తల్లి మాట్లాడుతూ ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని, కుట్రపూరిత ఉద్దేశ్యముందని ఆరోపించింది. పోలీసులు మాత్రం క్రికెట్ గొడవే కారణమని చెప్పారు.