Happy Friendship Day 2023: వెండి తెరపై ఈ స్టార్స్ దోస్తీ గురించి తెలుసా?
ప్రతి ఒక్కరి జీవిత పుస్తకంలో స్నేహానికి ముఖ్యమైన పేజీలు ఉంటాయి. స్నేహితులు లేనివాళ్లు దాదాపు ఉండరు. అసలు స్నేహం లేకుండా జీవితమే ఉండదంటే అతిశయోక్తి కాదు. కష్ట సుఖాల్లో దోస్త్ మేరా దోస్త్ అని చెప్పుకునే ఫ్రెండ్ ఒకరుంటే అంతకన్నా మించినది ఏం ఉంటుంది? కొన్ని సినిమాల్లో స్నేహానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇలా వెండి తెరపై ప్రస్తుతం కొనసాగుతున్న కొందరు స్టార్స్ దోస్తీ గురించి తెలుసు కుందాం.
సలార్ స్నేహం
అమ్మకు ఇచ్చిన మాట తాలూకు లక్ష్యం ఓ వైపు.. తన మిత్రుడి రక్షణ మరోవైపు... సలార్‌కి ఉన్న రెండు పెద్ద బాధ్యతలు ఇవి. ప్రభాస్ టైటిల్ రోల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సలార్’. శ్రుతీహాసన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ్మకు ఇచ్చిన మాట, స్నేహితుణ్ణి రక్షించుకోవాల్సిన బాధ్యత.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే హీరో పాత్రను ప్రభాస్ చేస్తున్నారని టాక్. అలాగే ఈ సినిమాలో ఫ్రెండ్షిప్కి సంబంధించి ఓ స్ట్రాంగ్ ఎపిసోడ్‌ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేశారని, ఈ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకే విధంగా ఉంటాయని సమాచారం. కాగా ‘సలార్’ కథలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది.
హాయ్ ఫ్రెండ్
స్నేహానికి ఏజ్‌తో, జెండర్‌తో పని లేదు. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ఉండే స్నేహం నేపథ్యంలో చిరంజీవి ‘ఇద్దరు మిత్రులు’, వెంకటేశ్ ‘వసంతం’, సిద్దార్థ్ ‘ఓ.. మై ఫ్రెండ్’ వంటి చిత్రాలు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో ఓ సినిమా చేరనుందని టాక్. అదే నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతీహాసన్ కీలక పాత్ర చేస్తున్నారు. శ్రుతీది నాని ఫ్రెండ్ క్యారెక్టర్ అని, వీరి కాంబినేషన్ సీన్స్ బాగుంటాయని టాక్. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 21న విడుదల కానుంది.
పుష్పగాడి ఫ్రెండ్
‘ఆర్య’ సినిమాలో ప్రేమలోని ఓ కొత్త కోణాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు హీరో అల్లు అర్జున్–దర్శకుడు సుకుమార్. అలాగే ‘ఆర్య 2’లో ఫ్రెండ్‌షిప్‌లోని మరో కోణాన్ని చూపించింది ఈ కాంబినేషన్. ఇప్పుడు ‘పుష్ప’తో మరోసారి స్నేహాన్ని చూపించారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఇందులో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించగా, ఆయన ఫ్రెండ్ కేశవగా జగదీష్ నటించారు.
పుష్పరాజ్, కేశవల మధ్య ఉన్న స్నేహం ఆడియన్స్‌కు భలే అనిపిస్తుంటుంది. సినిమాలో పుష్ప చేసే ప్రతి పనిలో కేశవ ఉంటుంటాడు. ఫ్రెండ్‌కు పుష్పరాజ్ ఇచ్చే ఇంపార్టెన్స్ అది. పుష్పరాజ్, కేశవల బాండింగ్‌ను ‘పుష్ప: ది రైజ్’లో కొంత చూశాం. అలాగే ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ వీరి ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా స్నేహం ఓ ప్రధానాంశంగా తెరకెక్కుతున్నాయి.