froude
-
అక్రమ దందా!
చుంచుపల్లి: జిల్లాలో ఇటుకబట్టీల అక్రమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం ఇటుక వ్యాపారులకు కలిసివస్తోంది. వివిధ శాఖల అనుమతితో బట్టీలను నిర్వహించాల్సి ఉండగా.. జిల్లాలో పలువురు వ్యాపారులు ఆ నిబంధనలను గాలికొదిలేశారు. ఇది లాభసాటి వ్యాపారం కావడంతో పుట్టగొడుగుల్లా బట్టీలు వెలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో అందరి దృష్టీ ఈ వ్యాపారంపైనే పడింది. జిల్లాలో ప్రతి మండలంలో రెండు, మూడు చొప్పున ఇటుకబట్టీలు వెలిశాయి. ఇందులో 42 బట్టీలు అనుమతి లేకుండా నడుస్తున్నాయని అధికారులే చెపుతున్నారు. వీటిలో 15 నుంచి 20 వరకు జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లోనే ఉండడం గమనార్హం. బట్టీల నిర్వహణకు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూలీలను తీసుకొచ్చి, వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. విచ్చలవిడిగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇటుకను కాల్చడానికి అడవుల్లోని కలపతో పాటు సింగరేణి బొగ్గును కూడా అక్రమంగా వినియోగిస్తున్నారు. వ్యవసాయ భూముల్లోనే నిర్వహణ.. జిల్లాలో ఇటుక బట్టీల నిర్వహణకు వ్యాపారులు అవలంబిస్తున్న విధానాలన్నీ అక్రమంగానే ఉన్నాయి. బట్టీ ఏర్పాటు చేయాలంటే ఆయా పంచాయతీల పరిధిలో రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. జిల్లాలో ఎక్కువ శాతం అటవీ ప్రాంతాలకు సమీపంలో వ్యవసాయ భూముల్లోనే వీటిని నిర్వహిస్తున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోని భూములను వినియోగించవద్దనే నిబంధన ఉన్నప్పటికీ.. గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారికి కొంత డబ్బును ముట్టజెప్పి తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఆ భూములను వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నందున నాలా సుంకం చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు భూగర్భ, గనులు, అటవీశాఖ అనుమతులు పొందాలి. కానీ జిల్లాలో ఎక్కడా సుంకం చెల్లించిన దాఖలాలు లేవు. పైగా ప్రస్తుతం ఉన్న ఇటుకబట్టీలకు అనుమతి కూడా తీసుకోవడం లేదు. ముందుగానే తహసీల్దార్, కాలుష్య నియంత్రణ అధికారి నుంచి అనుమతి పొందాలి. ఇవేమీ లేకపోగా ప్రభుత్వ స్థలాలు, అంబ సత్రం భూములు, అటవీ భూములు వినియోగిస్తున్నారు. దీంతో పాటు వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి వాగులు, చెరువుల్లో గోతులు తవ్వుతూ ఇటుకల కోసం మట్టిని తరలిస్తున్నారు. వీటిని పరిశీలించి మండలాల స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ సిబ్బంది ‘మామూలు’గానే వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక, మొరం లాగే ఇటుకల తయారీకి వినియోగించే మట్టి తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. అందుకు పన్ను(రాయల్టీ) చెల్లించాల్సి ఉంది. ఇది కూడా ఎక్కడా అమలుకావడం లేదు. ఏటా రూ.50 లక్షల మేర గండి.. ప్రభుత్వం ఏజెన్సీలో రైతుల సేద్యానికి బోరు మోటార్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. దీనిని ఆసరా చేసుకుని వ్యాపారులు ఇటుకల తయారీ కేంద్రం వద్ద బోరు వేసుకుని బట్టీలను నిర్వహిస్తున్నారు. దీనికి విద్యుత్ కనెక్షన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు రెండు నెలలకు రూ.8 వేల వరకు విద్యుత్ శాఖకు చెల్లించాలి. అయితే బట్టీల వ్యాపారులు సమీప వ్యవసాయ భూములు, బోరు మోటార్లను లీజుకు తీసుకుంటూ రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు కూడా చూసీ చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగం, పన్నుల రూపంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి ఏటా రూ.50 లక్షల మేర గండి పడుతోంది. అనుమతులు లేని ఇటుకబట్టీలపై చర్య తీసుకుంటాంజిల్లాలో అనుమతి లేని, అక్రమ ఇటుక బట్టీల నిర్వహణపై తక్షణ చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు ఆదేశాలిస్తాం. ఆయా మండల పరిధిలో ప్రతి తహసీల్దార్ అక్రమ ఇటుకబట్టీల విషయంలో కఠినంగా వ్యవహరించేలా చూస్తాం. ఇటుక బట్టీల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సంబంధిత వ్యాపారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – స్వర్ణలత, కొత్తగూడెం ఆర్డీఓ -
ఆఫర్లతో మోసం
► ఉచితం పేరుతో ఆన్లైన్ మోసాలు ► స్మార్ట్ ఫోన్లు, జియో ఆఫర్లు ఎర ► వెబ్ లింక్‌లను నమ్మితే ఖాతాలో సొమ్ము పోయినట్టే... ► అఫీషియల్ లింక్‌లనే విశ్వసించాలి ► సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు అవసరం ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న వెంకట్రావు స్మార్ట్ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. రూ.25,000 విలువైన స్మార్ట్ ఫోన్ కేవలం రూ.499లకే లభిస్తుందని అందులో ఉంది. ఇందుకు తన పేరు, ఊరు, బ్యాంకు ఖాతా తదితర వివరాలు నమోదు చేయమని మెసేజ్ వచ్చింది. వెంటనే ఆ వెబ్ లింక్‌లో వివరాలు పూర్తి చేశాడు. అంతే...క్షణాల్లో అతని బ్యాంకు ఖాతా నుంచి అధిక మొత్తంలో సొమ్ము విత్‌డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. తాను మోసపోయానని లబోదిబోమన్నాడు. సాక్షి, విశాఖపట్నం: ‘లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా, నామమాత్రపు ధరకు కావాలంటే ఈ లింక్ ఫాలో అవ్వండి’ ‘జియో ఆఫర్ కొనసాగాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి..అంటూ స్మార్ట్ ఫోన్లకు ఇటీవల కొన్ని సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. వాట్సప్‌లలో విపరీతంగా వ్యాపిస్తున్నాయి. వాటిని నమ్మితే నిలువునా మోసపోవడం ఖాయం. ఇప్పటికే పలు రకాలుగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నేరస్తులు ఏ అవకాశాన్ని వదలడం లేదు. స్మార్ట్‌ఫోన్‌కు వాట్సప్‌లో ఓ మెసేజ్ వస్తుంది. జియో ఆఫర్ ముసిగిపోయిందని, కొనసాగాలంటే కనిపిస్తున్న లింక్‌పై క్లిక్ చేయాలని దానిలో రాసి ఉంటుంది. అది చూసి నిజమనుకుని క్లిక్ చేయగానే సైబర్ దొంగలు తమ పని ప్రారంభించేస్తారు. లింక్‌పై క్లిక్ చేయగానే పేరేంటి, ఊరేంటి అంటూ అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. అన్నిటికీ సమాధానాలు ఇస్తూ పోతే చివరిగా ఆన్లైన్ పేమెంట్ కోసం అకౌంట్ నెంబర్, పిన్ నంబర్ నమోదు చేయమంటారు. ఈ వివరాలు పూర్తిచేయగానే మన అకౌంట్లో డబ్బులు మాయమైపోతాయి. మరో మెసేజ్ ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తోంది. షియోమీ, యాపిల్, సామ్సంగ్ కంపెనీల స్మార్ట్ ఫోన్లు రూ.25,000 వేలకు పైగా ఖరీదు గలవి కేవలం రూ.499కే లభిస్తాయని దాని సారాంశం. అది చూసి అంత తక్కువగా ఎలా ఇస్తారని, దీనిలో ఏదో మోసం ఉందని కూడా ఆలోచించకుండా కొందరు వెంటనే అక్కడ కనిపిస్తున్న వెబ్ లింక్‌ను తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా తెరవగానే మళ్లీ అదే కథ..వివరాలు అడగడం, సొమ్ము లాగడం జరిగిపోతుంది. నేరస్తులు మరో అడుగు ముందుకు వేసి ఈ మెసేజ్‌ను మరో పది మందికి పంపిచమని, అలా చేస్తే స్మార్ట్‌ఫోన్ మీదేనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ‘ఉచిత’ మోసాలు నమ్మి వివరాలు నమోదు చేస్తే చివరికి డబ్బు పోగొట్టుకుని బాధపడాల్సి వస్తుందని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. చైతన్యవంతంగా ఉండాలి ఆన్లైన్ మోసాల పాల్పడే నేరస్తులు సరికొత్త విధానాలను అవలంబిస్తున్నారు. ఇలాంటి నేరాల్లో పరిశోధన, పరిష్కారం కూడా ప్రయాసతో కూడుకున్నదే. నేరానికి పాల్పడిన వారు స్థానికంగా ఉండరు. ఇతర రాష్ట్రంలోనో, వేరే దేశంలోనో ఉంటారు. ఒకరిద్దరిని వెదికి పట్టుకున్నా ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడదు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న చాలా మంది ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. అందువల్ల ప్రజలే చైతన్యవంతంగా ఉండాలి. – టి.రవికుమార్ మూర్తి, క్రైమ్ డీసీపీ, విశాఖ సిటీ