fruits markets
-
మార్కెట్లకు మహాశివరాత్రి కళ
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి మహాశివ రాత్రి కళ వచ్చింది. పండుగ నేపథ్యంలో పూలు, పండ్ల దిగుమతి భారీగా పెరిగింది. హోల్‌సేల్ విక్రయాలకు అడ్డాలయిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్, గుడిమల్కాపూర్, జామ్‌బాగ్ తదితర మార్కెట్లు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. వందల కొద్దీ లారీల్లో పండ్లు, పూలు ఇక్కడికి వస్తున్నాయి. శివరాత్రి పండగ రోజు నగర ప్రజలు ఎక్కువ శాతం ఉపవాసం ఉండి..ఎక్కువగా పండ్లు ఆరగిస్తారు. రెండు మూడు రోజులపాటు పూజలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పూల విక్రయం కూడా అధికంగా ఉంటుంది. గతేడాది శివరాత్రి పండగ సందర్భంగా 2000 టన్నుల పండ్లు దిగుమతి కాగా పూలు దాదాపు 40 టన్నుల వరకు దిగుమతి అయ్యాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈసారి కూడా ఇదే రీతిలో దిగుమతులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు పెరగడంతో పుచ్చకాయ, సంత్రా, మొసంబి, ద్రాక్షతోపాటు దానిమ్మ పండ్లు ఎక్కువగా దిగుమతి పెరిగిందని హోల్‌సేల్ వ్యాపారులు తెలిపారు. పూల వ్యాపారం కోటిన్నర, పండ్లు దాదాపు రూ.20 కోట్ల మేర విక్రయాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ధరలు యథాతథం ఈ ఏడాది రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి సరిపడా పండ్ల దిగుమతి జరగడంతో రేట్లు ఎక్కువగా పెరగలేదు. ఇక శివరాత్రి సందర్భంగా రెండింతలు పండ్లు దిగుమతి అయ్యాయి. అయినా గత ఏడాది ఉన్న ధరలే హోల్‌సేల్‌గా ఉన్నాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. పుచ్చకాయ, మొసంబి, సంత్రా గత ఏడాది కంటే ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. దీంతో గత ఏడాది కంటే పండ్ల ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయని అధికారులు చెప్పారు. శివరాత్రి పురస్కరించుకొని రిటైల్ ధరలు కాస్త పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పండ్లు కిలో రూ.10–రూ.20 వరకు పెంచారు. మార్కెట్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు మహాశివరాత్రి నేపథ్యంలో మారెŠక్ట్కు పండ్ల దిగుమతి పెరుగుంది. అందుకే రైతులకు ముందస్తుగానే స్థలాలు కేటాయించాం. పండ్లకు గిట్టుబాటు ధర లభించే చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మార్కెట్లోకి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించి, జాగ్రత్తలు పాటిస్తున్నాం. పండ్ల వాహనాలు ఎప్పటికప్పుడు అన్లోడ్ చేయించి బయటకు పంపించడానికి కమీషన్ ఏజెంట్లకు ఆదేశాలు జారీ చేశాం. – ఈ.వెంకటేశం, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ, ఉన్నత శ్రేణి కార్యదర్శి పూల రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు శివరాత్రి పురస్కరించుకొని మార్కెట్‌కు దాదాపు అన్ని రకాల పూలు ఎక్కువ మొత్తంలో దిగుతులు జరుగుతున్నాయి. ఈ ఏడాది పూల ధరలు అంతగా పెరగలేదు. అన్ని రకాల పూల ధరలు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. మార్కెట్‌కు వచ్చే పూల రైతులకు స్థలాలు ఎప్పటికప్పుడు కేటాయించి, వారికి గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు చేపట్టాం. కమీషన్ ఏజెంట్లు కొన్న పూలకు రైతులకు వెంటనే డబ్బులు అందుతాయి. రైతులకు ఇంకా ఎమైనా ఇబ్బందులు ఉంటే కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని మార్కెట్ గోడలపై పోస్టర్లు అంటించాం.– ఎం.రవీందర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి(ఎఫ్ఏసీ), గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ -
పండులో..విషముండు
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో పీల్చే గాలి, తాగే నీరే కాదు.. ఆకుకూరలు, కూరగాయలతో పాటు నిగనిగలాడుతూ నోరూరించే పండ్లు సైతం విషతుల్యమవుతున్నాయి. మార్కెట్‌కు ప్రతిరోజు దేశ, విదేశాలకు చెందిన ఎన్నో రకాల పండ్లు దిగుమతి అవుతుంటాయి. అయితే, వాటిని మగ్గించేందుకు ఇక్కడి వ్యాపారులు రసాయనాలు వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని ప్రధాన పండ్ల మార్కెట్లు, బహిరంగ మార్కెట్లలో విక్రయిస్తున్న వివిధ రకాల పండ్లను చైనా పౌడర్, ఇతరరసాయనాలతో కృత్రిమంగా మగ్గబెడుతున్నారని, దాంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ తాజా అధ్యయనంలో గుర్తించింది. కాయలను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రసాన పౌడర్‌తో పాటు ఎసిటలిన్ గ్యాస్, కార్బైడ్ వంటి పదార్థాలు వాడుతున్నారని తేల్చింది. ఈ పండ్లలో ఆర్సినిక్, ఫాస్పరస్ వంటి మూలకాల ఆనవాళ్లున్నట్లు ప్రకటించింది. ఈ రసాయనాలున్న పండ్లు తిన్నవారికి మెదడు, నరాలు, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు, చర్మవ్యాధులు, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడతారని హెచ్చరించింది. మోతాదు మించితే ప్రమాదం మార్కెట్లో పండ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఇప్పుడు పలువురు వ్యాపారులు చైనా పౌడర్, ఎసిటలిన్ గ్యాస్, ఫాస్పరస్, ఆర్సెనిక్ తదితర మూలకాలున్న రసాయనాలను వాడుతున్నారు. పైగా ఆయా రసాయనాలను అతిగా వినియోగిస్తుండడంతో పరిస్థితి చేయిదాటుతోంది. పండ్లను కృత్రిమంగా మగ్గబెట్టేందుకు ఇథిలిన్ గ్యాస్‌ను పెద్దమొత్తంలో వినియోగిస్తున్నారు. పండ్లను మగ్గబెట్టే ఛాంబర్లో ఈ గ్యాస్ మోతాదు 100 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) యూనిట్లకు మించరాదన్నది ప్రభుత్వ నిబంధన. కానీ చాలామంది వ్యాపారులు ఈ నిబంధనను పాటించడంలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి గ్యాస్‌ను నేరుగా పండ్లకు తగలకుండా పేపర్లో చుట్టిన తరవాతనే గ్యాస్‌ను ప్రయోగించాలి. అయితే ఈ నిబంధనకు కూడా చాలామంది వ్యాపారులు నీళ్లొదిలి నేరుగా వాడుతున్నట్టు గుర్తించారు. ఇంకొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా కంప్రెస్డ్ ఇథిలిన్ గ్యాస్, ఇథనాల్, ఇథోపాన్ వంటి రసాయనాలను అవసరాన్ని మించి వినియోగిస్తున్నారని, ఇది నేరుగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించింది. అమ్మో చైనా పౌడర్ హానికారక రసాయనాలు, మూలకాలున్న చైనా పౌడర్‌ను చెన్నై, ముంబై పోర్టుల నుంచి నేరుగా నగరంలో పలువురు దళారులు, వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. దీన్ని పండ్ల వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు ఇటీవల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థ దాడుల్లో బయటపడింది. ఐపీఎం అధికారుల దాడులతో అప్రమత్తమవుతోన్న వ్యాపారులు గోడౌన్ల బయట కొన్ని పండ్లను నిబంధనల ప్రకారం మగ్గబెట్టి రసాయనాల ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గోడౌన్ లోపల భారీగా నిల్వ ఉంచిన పండ్లను మాత్రం రసాయనాలతో పండిస్తున్నారు. ఈ పండ్లలోనే ప్రమాదకర రసాయన ఆనవాళ్లు అధికంగా ఉంటోందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చింది. కొనే ముందు పరిశీలించాలి.. ♦ మార్కెట్లో కొనుగోలు చేసే పండ్లపై అధిక సంఖ్యలో నల్లటి మచ్చలుంటే వాటిపై రసాయనాల ఆనవాళ్లున్నట్లు గుర్తించాలి. ♦ యాపిల్, ఆరెంజ్, దానిమ్మ వంటి పండ్లు బాగా నిగనిగలాడుతుంటే వాటిపై రసాయనాల పూత ఉన్నట్టు. ♦ పండ్లను తినేముందు బాగా కడిగి తినాలి. ♦ సహజసిద్ధంగా పక్వానికి వచ్చే పండ్లను తింటేనే ఆరోగ్యానికి మంచిదని, ఆయా పండ్లలో ఆవశ్యక పోషకాలుంటాయని గుర్తించాలి. -
మామిడికి కార్బైట్ కాటు
► విషతుల్యమవుతున్న మధుర ఫలాలు ► నిషేధం ఉన్నా పట్టించుకోని యంత్రాంగం హైదరాబాద్: పండ్లలో రారాజుగా.. మధుర ఫలంగా పేరొందిన మామిడిపండ్లు వ్యాపారుల లాభాపేక్ష కారణంగా విషతుల్యమవుతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఇష్టపడే ఈ పండు అనేక రోగాలకు కారణమయ్యే పరిస్థితి నెలకొంది. త్వరగా రంగు వచ్చేందుకు వ్యాపారులు యథేచ్ఛగా కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు. వారం రోజులు మగ్గపెడితే కానీ పక్వానికి రాని మామిడికాయలపై కార్బైడ్ రసాయనం చల్లుతుండడంతో ఒక్క రాత్రిలోనే నిగనిగలాడే పసుపు రంగు వస్తోంది. దీంతో రంగు చూసి మోసపోతున్న ప్రజలు వాటిని అధిక ధర ఇచ్చి మరీ కొనుగోలు చేసి రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలా మాగబెడుతున్నారు జిల్లాలో మామిడి సీజన్ మొదలైంది. ఏ పండ్ల దుకాణాలు చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తున్నాయి. వ్యాపారుల మధ్య ఉన్న పోటీ, సంపాదనే ధ్యేయంగా మార్కెట్లోకి వచ్చిన పచ్చి మామిడికాయలను కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలు ఉపయోగించి మాగబెడుతున్నారు. 30 కిలోల మామిడికాయలకు 200 గ్రాముల కార్బైడ్ రసాయనం ఉపయోగిస్తున్నారు. ఒక్క రాత్రిలో కాయలు పండ్లుగా మారుతున్నాయి. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న కాయల మధ్యలో కార్బైడ్‌ను ఉంచి వాటిని బాక్సుల్లో పెట్టి రవాణా చేస్తున్నారు. అక్కడికి వెళ్లేసరికి ఆ కాయలు పండ్లుగా మారతాయి. వచ్చే వ్యాధులు ఇవీ.. రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తిన్న వారికి నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గర్భిణులు, చిన్నపిల్లలకు అనేక రకాల ఆరోగ్య రుగ్మతలు తలెత్తే ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లల్లో అయితే శ్వాస సంబంధిత జబ్బులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాక కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయని, వ్యాధినిరోధక శక్తి తగ్గుతుందని, పరిస్థితి విషమిస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులకు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉందని కనుక మామిడి పండ్లు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టించుకోని అధికారులు కాల్షియం కార్బైడ్ వినియోగంపై నిషేధం విధించినా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆ విధానాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నారు. మామిడి వ్యాపారం దాదాపుగా దీనిపైనే కొనసాగుతుంది. వినియోగదారులు ఈ కాయల రంగును బట్టి కొనుగోలు చేసి అనారోగ్యాల పాలవుతున్నారు. పబ్లిక్ హెల్త్ అధికారులు సైతం వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు.