ఆ జడ్జీల సీనియారిటీని పరిగణించలేం: సుప్రీం
న్యూఢిల్లీ: ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమితులైన జ్యుడీషియల్ ఆఫీసర్లకు నేరుగా నియమితులైన ఇతర న్యాయమూర్తుల్లాగా సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కోరే హక్కు లేదని, వారి నియామకాలు తాత్కాలికమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదోన్నతుల విషయమై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొందరు జ్యుడీషియల్ ఆఫీసర్లు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఫాస్ట్‌ట్రాక్ జడ్జీల నియామకాలు కొన్ని నిబంధనలకు అనుగుణంగా జరిగాయని, సాధారణ నియామకాలకు వీటికి తేడా ఉందని తీర్పులో వెలువరించింది. ఈ స్కీమ్ వల్ల పిటిషనర్లు పదోన్నతి పొందారని, దీని వల్ల వారికి లబ్ధి జరిగిందని కోర్టు తెలిపింది. వారు ఈ పోస్టుల్లో కొనసాగుతున్న సమయంలోనే సాధారణ పోస్టుల్లో ఖాళీలు ఏర్పడితే వీరిని పరిగణిస్తామని ధర్మాసనం తెలిపింది. ప్రత్యక్షంగా నియమితులైన వారికి, జ్యుడీషియల్ ఆఫీసర్ల మధ్య ఇలాంటివి ఎడతెగని వ్యవహారాలని కోర్టు వ్యాఖ్యానించింది.