తిథి, వార, నక్షత్రాలను చూసి నిర్ణయిస్తారా?
మామూలుగా ఎన్నికల తేదీలు నిర్ధారించాలంటే సెలవులు, పండుగలు, పరీక్షలు, తీర్థాలు, జాతరల వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. దీనితో పాటు వాతావరణం, వానలు పడతాయా, చలి ఎలా ఉంటుంది వంటి కూడా లెక్కలోకి తీసుకుంటారు.
ఈ సారి వీటన్నిటితో పాటు పోలింగ్ తేదీ అమావాస్య నాడు లేదా కృష్ణపక్షంలో ఉండకుండా, పౌర్ణమికి దగ్గరగా అంటే శుక్లపక్షంలో ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ జ్యోతిష్యాన్నో లేక పంచాంగాన్నో నమ్ముకుందా? ఎన్నికల తేదీలు కూడా తిథి, వార, నక్షత్రాలను చూసి నిర్ణయిస్తారా? ఇలాంటి అనుమానాలు రావడం సహజం.
అయితే దీని వెనుక వేరే లెక్కలేవీ లేవు. దేశంలోని 9 రాష్ట్రాల్లోని 83 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించడం చాలా ప్రమాదభరితమైన పని. నక్సల్స్ మందుపాతరలు పేల్పవచ్చు. పోలింగ్ బూత్ లను ధ్వంసం చేయొచ్చు. పోలింగ్ సిబ్బందిని అపహరించవచ్చు. అమావాస్య లేదా కృష్ణపక్షం సమయంలో రాత్రి పూట చిమ్మచీకటిగా ఉంటుంది. దీని వల్ల దాడులు చేయడం సులువవుతుంది. అదే శుక్లపక్షం అయితే రాత్రి పూట వెన్నెల బాగా ఉంటుంది. నక్సల్ కదలికలను గమనించడానికి వీలవుతుంది. నక్సల్ దాడికి కూడా అనుకూల పరిస్థితులు ఉండవు.
అందుకే రాత్రి వెన్నెల వెలుగు ఉండేలా శుక్లపక్షంలోనే నక్సల్ ప్రభావిత ప్రాంతాల పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నక్సల్ ప్రభావిత క్షేత్రాల్లో ఒకే సారి ఎన్నికలు జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్ 10 న ఈ పోలింగ్ జరుగుతుంది.