విద్యానిధి నిష్ఫలం?
సాక్షి, కాకినాడ : పేద వర్గాలకు కార్పొరేట్ విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన ‘విద్యానిధి’ నిష్ఫలమైంది. దానికి సంబంధించిన కోట్లాది రూపాయలు బ్యాంకులో మూలుగుతున్నాయి. అయితే దీన్ని పట్టించుకొనే నాథుడే లేడు. వివరాల్లోకి వెళితే... నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించేందుకు పూర్వపు కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర ‘విద్యానిధి’ పేరిట చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని యోచించారు.
ఆమేరకు 2010-11లో రవిచంద్ర ఎస్పీ, మహిళా సమాఖ్య, డీఆర్డీఏ పీడీ తదితరులతో కమిటీ నెలకొల్పారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నెలలో ఒకరోజు వేతనాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. జిల్లాలో ఎనభై వేల వరకూ ఉన్న మహిళా సంఘాల సభ్యులైతే ఒకో సంఘం నెలకో రూపాయి వేస్తే చాలన్నట్టు ట్రస్టును తీర్చిదిద్దారు. వీరు కాక కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛందంగా విరాళాలిచ్చే దాతలు ముందుకొస్తే పేదల విద్యకు అడ్డు ఉండదనుకున్నారు. అలా పోగు చేసిన మొత్తం రూ.3 కోట్లయింది. దీనిని జగన్నాథపురం ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేశారు.
ఇంత మొత్తం డిపాజిట్ చేసినందుకు జిల్లాలోని ఆ బ్యాంకు బ్రాంచీల నుంచి ఒకో బ్యాంకు కనీసం ఏడాదికి ఐదుగురికి చదువుకునేందుకు రుణం కల్పించాలన్న షరతు పెట్టారు. పథకానికి రూపకల్పన చేసిన కలెక్టర్ రవిచంద్రకు రెండేళ్ల క్రితమే బదిలీ కాగా మరికొంత కాలానికి డీఆర్డీఏ పీడీకి బదిలీ అయింది. మిగిలిన వారు దీన్ని పట్టించుకోకపోవడంతో ఈ మహోదాత్త ఆశయం నీరుకారింది.
పేర్లు మార్పుతో ఆచరణలోకి
ఉన్నత ఆలోచనలతో వసూలు చేసిన విరాళాల సొమ్ము హోదాలతో కాకుండా ట్రస్టు ద్వారానే వ్యక్తుల పేర్ల (రవిచంద్ర, మధుకర్బాబు) మీద బ్యాంకులో జమయింది. వారిద్దరూ జిల్లాను వదిలి వెళ్లడంతో ఆ నిధుల వినియోగానికి ముందుకెళ్లాలంటే ఆయా పేర్లను బ్యాంకులో హోదాలకు బదలాయించాలి. అప్పుడు మాత్రమే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. దీనికి రవిచంద్ర పూర్తి అంగీకారం తెలుపుతూ ట్రస్టు సమావేశమై పిలిస్తే వస్తానంటున్నారు. ఈ అంశంపై డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు మాట్లాడుతూ ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రానున్న విద్యాసంవత్సరం నుంచి ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తానన్నారు.