సూసైడ్... గుడ్సైడ్
సూసైడ్ అంటే ఆత్మహత్య! అలాంటి ఆలోచన ఎందుకొస్తుంది? అలాంటి ప్రవర్తనను ఎలా ఆపాలి?!
జీవితం మీద ఆశ కలిగితే... జీవితానికి ఒక గుడ్సైడ్ ఉందని తెలిస్తే...! సూసైడ్ ఉండదని చెబుతున్నారు నిపుణులు
‘ఫ్యూచర్ లైఫ్ థెరపీ’ ద్వారా భవ్యమైన భవిష్యత్తును చూపించి కొత్త జీవితానికి వారధి వేశారు.
‘సురేంద్రా.. నువ్వేమో కష్టపడి ఒక్కో రూపాయి సంపాదిస్తే నీ కొడుకేమో నీ కష్టాన్ని ఒక్క పూటలోనే ఖర్చు చేస్తాడు’’ అంటున్న మధును విస్మయంగా చూశాడు సురేంద్ర.
‘‘ఏంటీ మధూ నువ్వంటున్నది?’’ అర్థంకాక అడిగాడు సురేంద్ర.
‘‘నిన్న పిల్లాడి కాలేజీ ఫీజు కట్టాలని ఎన్ని తంటాలు పడ్డావు. తెలిసినవారందరినీ అడిగి, అప్పు చేసి మరీ డబ్బు తీసుకెళ్లావా! వాటిని కాలేజీలో కట్టమని నీ కొడుక్కిచ్చావా?’’ అడిగాడు మధు. ‘‘అవునూ.. అయితే!’’ అన్నాడు అనుమానంగా సురేంద్ర. ‘‘తెలిసినతను హోటల్‌రూమ్‌లో దిగాడంటే వెళ్లాను. అక్కడ ఫ్రెండ్స్‌తో మీ అబ్బాయి కనిపించాడు పార్టీ చేసుకుంటూ! ఆరాతీస్తే ఫ్రెండ్స్‌తో ఏదో పందెంలో గెలిచాడట. పార్టీ ఇస్తున్నాడు..’’ చెప్పాడు మధు. సురేంద్ర ముఖం వాడిపోయింది. ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయాడు.
చచ్చిపోతానని బెదిరింపులు
అర్ధరాత్రి తలుపుకొట్టిన చప్పుడైతే లేచి వెళ్లాడు సురేంద్ర. తలుపు తీస్తే, ఎదురుగా కొడుకు కిరణ్. అతని కన్నా ముందు... మద్యం వాసన వస్తోంది. బిటెక్ ఫస్టియర్ చదువుతున్న కొడుకును అలా చూసేసరికి సురేంద్ర తట్టుకోలేకపోయాడు. ‘‘ఏంట్రా ఇది... బుద్ధుందా నీకు...’’ తండ్రి మాట పూర్తికాకుండానే ‘‘ఏయ్, నోర్మూసుకొని ఉండు. ఎక్కువ చేయకు..’’ కిరణ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అలికిడికి సురేంద్ర భార్య లక్ష్మి లేచొచ్చింది. పరిస్థితి అర్థమైన లక్ష్మి ‘‘ఏంట్రా, మీ నాన్నకే ఎదురుచెబుతావా!’’ అని కిరణ్ చెంప ఛెళ్ళుమనిపించింది లక్ష్మి.
పాండవుల పక్షాన కౌరవుల వద్దకు రాయబారిగా సంధి చేయడానికి వెళ్లాడు కృష్ణుడు. పాండవులు అడిగిన ఐదు ఊళ్లు ఇచ్చేసి, యుద్ధం జరగకుండా చూడమని కోరాడు. అందుకు దుర్యోధనుడు, కర్ణుడు ససేమిరా అన్నారు. హిప్నోథెరపిస్ట్ అయిన కృష్ణుడు వారి భవిష్యత్తును చెబుతూ– ‘మీ భవిష్యత్తు నాకు స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధంలో మీ మరణమే కాదు, ఈ లోకం ఉన్నంతవరకు మీరు పొందే గౌరవం కూడా కళ్లకు కనపడుతుంది. ఇది మీకు తెలియకపోవడం మీ దురదృష్టకరం’ అన్నాడు. అదే నిజమైందని మహాభారత గ్రంథం మనకు స్పష్టం చేస్తోంది.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాని అన్న విషయం దక్షిణ భారతీయులు అందరూ నమ్ముతారు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఆయన చెప్పినట్టే ఇప్పుడు ఉందనీ, ఇక ముందు కూడా ఉంటుందనీ కథలు కథలుగా చెబుతుంటారు. ఆయన ధ్యానమార్గంలో భవిష్యత్తును దర్శించిన యోగి. అదే ఇప్పుడు ఫ్యూచర్‌లైఫ్ థెరపీలో ఓ భాగమైందని చెప్పవచ్చు.
‘పవర్ ఆఫ్ నౌ’ అనే పుస్తకం మన దైనందిన జీవితం గురించి, ఒత్తిడుల గురించి, మన ఆలోచనలు గతంలో ఎలా ఉన్నాయి, అవి భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తున్నాయి అని తెలుసుకునే అవకాశం ఇస్తుంది. కెనడియన్ రచయిత ‘ఎక్‌హార్ట్ టోల్’ 1990లో రాసిన ఈ పుస్తకాన్ని ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్ప్రే మద్దతుతో 2009లో 33 భాషల్లోకి అనువదించి, ప్రచురించారు.
‘‘నన్నే కొడతారు కదూ.. చెప్తా, నేను ఛస్తేనే మనశ్శాంతి’’ అనుకుంటూ గదిలోకెళ్ళి తలుపులేసుకున్నాడు.
సురేంద్ర, లక్ష్మి కంగారు పడ్డారు. ‘‘కిరణ్ డోర్ తీయరా! కోపంలో ఏదో అంటే చచ్చిపోతానంటే ఎలారా!’’ అని ఎంత బతిమిలాడినా డోర్ తెరుచుకోలేదు. కిరణ్ ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యా యత్నం చేశాడు. చావు వరకు వెళ్లొచ్చాడు. తమకూ నరకం చూపించాడు. సురేంద్ర ఇనుపరాడ్‌తో డోర్ పగలకొట్టాడు. ఆదుర్దాగా లోపలికెళ్లారు. కిరణ్ బెడ్ మీద పడుకొని ఉన్నాడు.
భార్యాభర్తలిద్దరూ ‘హమ్మయ్య, గండం గడిచింది’ అనుకున్నారు. కానీ, దిన దిన గండంగా ఉన్న ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు వారికి.
‘‘ఎన్నో నోములు నోస్తే పెళ్లయిన ఏడేళ్లకు పుట్టాడు. పుట్టకపోయినా బాగుండేదనిపిస్తుంది’’ అంది లక్ష్మి ఏడు స్తూ. భార్యను ఓదారుస్తూ ఉండిపోయాడు సురేంద్ర.
మంచి భవిష్యత్తుకు మార్గం
‘కిరణ్! మీ అమ్మనాన్నలు అబద్ధం చెప్పే తీసుకువచ్చారు ఇక్కడకు నీ భవిష్యత్తు కోసం. పదేళ్ల తర్వాత నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూసుకోవాలనుకుంటున్నావా?’’ ఇన్స్ట్రక్టర్ మాటలు ఆసక్తిగా అనిపించాయి కిరణ్‌కి.
అది భవిష్యత్తును కళ్లకు కట్టే ఫ్యూచర్ లైఫ్ థెరపీ క్లినిక్. సురేంద్ర ఫ్రెండ్ మధు పిల్లవాడిని ఇక్కడకు తీసుకొచ్చి చూపించమంటే వచ్చారు. ‘‘భవిష్యత్తును చూసుకోవడమా, అదెలా?’’ అడిగాడు ఆసక్తిగా!
ఫ్యూచర్లోకి ప్రయాణం
కిరణ్‌ని మెత్తటి కుర్చీలో కూర్చోబెట్టారు ఇన్స్ట్రక్టర్. ముందు నాలుగుశ్వాసలు చిన్నగా, ఐదవ శ్వాస దీర్ఘంగా... ఇలా 21 సార్లు శ్వాస తీసుకో! ఆ తర్వాత నీ మనోనేత్రం ముందు ఓ అందమైన ప్రపంచం ఆవిష్కృతమవుతుందని చెప్పారు ఇన్స్ట్రక్టర్.
నిపుణులు చెప్పినట్టుగా చేస్తున్నాడు కిరణ్.
మస్కిష్తంలో తన జీవితాన్ని దర్శిస్తున్నాడు. నిపుణుల సూచనలు అందుతున్నాయి.. ‘‘కిరణ్! ఇప్పుడు నీ మనోనేత్రం ముందు ఓ సెలయేరు ప్రవహిస్తోంది. ఆ సెలయేటిని దాటడానికి ఓ వంతెన.. దానిని దాటుతున్నావు. 1...2...3...4...5.. ఆ వంతెన దాటనే ఓ అందమైన గార్డెన్ లోకి ప్రవేశించావు. ఆ గార్డెన్ ఎలా ఉందో వర్ణించు’’ అనడంతో మొదలైంది థెరపీ. అందులోని పువ్వులు, ఫౌంటెయిన్ గురించి, దాని పక్కనే ఉన్న తన ఇల్లు గురించి గొప్పగా చెబుతున్నాడు కిరణ్. అతని వదనం ఎంతో ఆనందంగా, మరెంతో ప్రశాంతంగా ఉంది.
‘‘ఇప్పుడు నీ కాలేజీ, ఎగ్జామ్స్, మార్కులు, ర్యాంకులు అన్నీ చూసుకో...’’ఇన్స్ట్రక్టర్ అడుగుతున్నాడు. ‘‘అన్నింటిలోనూ నాకు మంచి మార్క్‌లు వచ్చాయి. నేను ఎమ్మెస్‌లో చేరుతున్నాను’’ వర్ణిస్తున్నాడు కిరణ్.
‘ఆశ’తో జీవిస్తాం
పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో గతాన్ని దర్శించుకొని క్షమాపణలతో ‘బ్లాక్స్’ని తుడిచేసుకొనే ప్రయత్నం చేస్తాం. ఫ్యూచర్ లైఫ్ థెరపీ ద్వారా భవిష్యత్తును దర్శించి ‘ఆశ’తో జీవిస్తాం. వ్యాధులు, వ్యసనాలకు లోనైనవారు, జీవితమ్మీద ఇచ్ఛను కోల్పోయినవారికి ఈ థెరపీ ఒక ఆలంబనగా పనిచేస్తుంది. ఈ చికిత్స వల్ల మనసుకు స్వస్థత చేకూర్చి, శారీరక జబ్బుల నుంచి విముక్తి కలిగించవచ్చు.
– డా. హరికుమార్, జనరల్ సర్జన్, మోటివేషనల్ స్పీకర్, హైదరాబాద్
‘‘మరో ఐదేళ్లు అలాగే నీ భవిష్యత్తును దర్శించు..’’ అన్నారు ఇన్స్ట్రక్టర్.
‘‘నాకు మంచి జాబ్ వచ్చింది. పెళ్లి అవుతోంది. చాలామంది అతిథులు వచ్చారు. వారి మధ్య రాజులా మెరిసిపోతున్నాను. అమ్మ... నాన్న... నా కుటుంబం.. ఎంతో ఆనందంగా ఉన్నాను..’’ కిరణ్ చెబుతున్నాడు.
‘‘నీ భవిష్యత్తు ప్రయాణంలో అమ్మనాన్నలంటే కోపం ఉందా?’’ అని ప్రశ్నించారు థెరపిస్ట్. ‘‘లేదు, నాకు చదువులో కన్ఫ్యూజన్. అందుకే నా ఫ్రెండ్స్ చెప్పినట్టు విన్నాను. కానీ, నాకు ఇప్పుడు అంతా తెలుస్తోంది.’’ కిరణ్ తను ఎలా ఉండాలనుకున్నాడో, ఎలా ఉండకూడదనుకుంటున్నాడో ఆ థెరపీలో వివరించాడు. 30 నిమిషాల పాటు సాగిన థెరపీ పూర్తయ్యింది.
సమ్మోహన చికిత్స
హిప్నోథెరపీని తెలుగులో సమ్మోహన చికిత్స అంటారు. ఈ చికిత్స సరైన విధానంలో నిపుణుల పర్యవేక్షణలో తీసుకుంటే జబ్బుల నుంచి, చెడు అలవాట్ల నుంచి దూరం కావచ్చు. డాక్టర్ బ్రూస్ గోల్డ్ బర్గ్ అమెరికన్ దంత వైద్యుడు. హిప్నోథెరపిస్ట్ కూడా! ఎవరికి వారు టైమ్‌మిషన్‌లో ప్రయాణించినట్టు గత జన్మతో పాటు భవిష్యత్తును కూడా దర్శించవచ్చు అని నిరూపించిన వ్యక్తి. రేడియో, టెలివిజన్లలో టాక్‌షోలు, వర్స్షాప్స్, పుస్తకాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు బ్రూస్.
క్షమాపణలతో వెలుగు
ఆశ్చర్యంగా, ఆనందంగా చూశాడు కిరణ్ ఇన్‌స్ట్రక్టర్‌ని.
‘‘సర్, నా భవిష్యత్తు ఇంత అందంగా ఉంటే నేను చచ్చిపోవాలని పదే పదే ఎందుకు అనుకున్నాను? ఎలా అనుకోగలిగాను? నా ప్రవర్తన వల్ల నా తల్లితండ్రులను ఎప్పుడూ బాధిస్తూనే ఉన్నాను. క్షమించండి నాన్నా’’ అన్నాడు కిరణ్. సురేంద్ర, లక్ష్మి ఆనందంగా కళ్లనీళ్లు తుడుచుకున్నారు. తమను ఇక్కడకు తీసుకువచ్చిన స్నేహితుడు మధుకి కృతజ్ఞతలు చెప్పాడు సురేంద్ర.
మార్చుకున్న భవిష్యత్తు కిరణ్ స్నేహితులతో ఎప్పుడున్నా, ఏ పని చేస్తున్నా..
తన భవిష్యత్తు గురించి ఆలోచన రాసాగింది. తన మనోఫలకం మీద మెరిసిన అందమైన భవిష్యత్తును చేజేతులా పాడుచేసుకుంటున్నానా.. అనే ఆలోచన పదే పదే అతని మనసును తొలుస్తోంది. దీంతో మెల్ల మెల్లగా చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరమవ్వసాగాడు. భవిష్యత్తును అందంగా మలుచుకునే పనిలో పడ్డాడు.
– నిర్మల చిల్కమర్రి