ప్రభుత్వాసుపత్రిలో కానిస్టేబుల్ వీరంగం
నెల్లూరు: మద్యం మత్తులో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ చేతిలో ఉన్న తుపాకీ పేలింది. దీంతో నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలోని రోగులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పేలిన తుపాకీ గుండు ఆసుపత్రిలోని గోడకు తగలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఆర్ కానిస్టేబుల్ జీ అనిల్ కుమార్ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డుకు గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం మద్యం సేవించి విధులకు వచ్చారు. మద్యం మత్తులో సాయంత్రం ఐదు గంటల సమయంలో తన వద్ద ఉన్న 303రైఫిల్ ను చేతులతో తిప్పుతూ హల్ చల్ చేశారు. తోటి సిబ్బంది వద్దని వారిస్తున్నా పెడచెవిన పెట్టారు. అంతలోనే రైఫిల్ పేలిన శబ్దం రావడంతో అక్కడి వారంతా భయంతో పరుగులు తీశారు.
వార్డు ఎదురుగా ఉన్న గోడకు తగిలి కిందపడిన తూటాను అనిల్ సహచర ఉద్యోగులు గమనించారు. వెంటనే అనిల్ వద్ద ఉన్న తుపాకీని తీసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు అనిల్ కు బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షలకు పంపారు. తూటా, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అయితే అనిల్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారా? లేదా అనే విషయాలు తెలియాల్సివుంది.