నేలకొరిగిన ‘సేంద్రియ’ శిఖరం!
తెల్లని గడ్డం, తలపాగా, ఆకుపచ్చని పైపం చె, పచ్చని పంటపై నుంచి వీచే పైరుగాలిలా చెరగని చిరునవ్వు.. వెరసి డాక్టర్ జీ నమ్మాళ్వార్! అరుదైన సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్తగా, రైతాంగ ఉద్యమకారుడిగా, సుస్థిర సేద్యాన్ని ప్రచారం చేయడమే కాకుండా స్వయంగా పూనికతో ఆచరించిన సాధువు. ఇటు వ్యవసాయ శాస్త్రవేత్తలు.. అటు సాధారణ రైతుల్లో ఒకరై.. సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగు ఆవశ్యకత గురించి, జన్యుమార్పిడి పంటలతో ముప్పు గురించి మామూలు మాటల్లో విడమర్చి చెప్పిన నేతగా గుర్తింపు పొందారాయన. రైతుల హక్కుల కోసం ఐదు దశాబ్దాలు పోరాడిన నమ్మాళ్వార్ 75 ఏళ్ల వయసులో తంజావూరు జిల్లాలోని తన స్వగ్రామం ఎలాంగడులో డిసెంబర్ 30న తుదిశ్వాస విడిచారు.
1939 ఏప్రిల్ 16న జన్మించిన నమ్మాళ్వార్ అన్నామలై యూనివర్సిటీలో వ్యవసా యశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. 1963లో కోవిల్పట్టిలోని ప్రభుత్వ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. హరిత విప్లవం ప్రారం భ దినాలవి. మెట్టపొలాల్లో పత్తి, చిరుధాన్యాల సాగులో హైబ్రీడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వంటి ఖరీ దైన ఉత్పాదకాలు వాడటంపై పరిశోధనలు జరిగిన రోజులు. వర్షాధార ప్రాంతంలో నిరుపేద రైతులు ఖరీదైన ఉత్పాదకాలు కొని వాడ టం తలకుమించిన భారం కావడంతోపాటు భూసారం నాశనమవుతుందని, ఈ పద్ధతి రైతులకు మేలు చేయబోదని నమ్మాళ్వార్ తొలి దశలోనే గుర్తించారు. నేలతల్లిని నమ్ముకొని జీవించే పేద మెట్ట రైతులకు ఖరీదైన రసాయనిక వ్యవసాయం అలవాటు చేయడం నష్టదాయకమని వాదించారు. ప్రభుత్వ పరి శోధన ప్రాథమ్యాలను సమూలంగా సమీక్షిం చాల్సిన అవసరం ఉందని పట్టుబట్టారు. తన గోడు వినిపించుకున్న నాథుడు లేకపోవడం తో.. ఆరేళ్లకే ప్రభుత్వోద్యోగానికి స్వస్తి పలికి సేంద్రియ వ్యవసాయోద్యమ బాటపట్టారు.
నోబెల్ బహుమతి గ్రహీత డోమినిక్ పైర్ స్థాపించిన ఐలాండ్ ఆఫ్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున తమిళనాడులో పదేళ్ల పాటు పనిచేశారు. సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు చేశారు. పంటల గడ్డీ గాదం ఎందుకూ పనికిరాని వ్యర్థాలని భావిస్తున్న రోజులవి. గడ్డిని తిరిగి భూమిలోనే కలిసేలా చేయడం ద్వారా పోషకాలు సహజంగా తిరిగి భూమికి చేరతాయని ఆయన గ్రహించారు. కాబట్టి, రసాయనిక ఎరువుల వంటి ఖరీదైన ఉత్పాదకాలను వేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ గ్రహింపే సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్తగా నమ్మాళ్వార్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తదనంతరం రసాయనిక ఉత్పాదకాల అవసరం లేదని ఉధృతంగా ప్రచారం చేశారు.
1970వ దశకంలో పాలో ఫ్రైరీ, వినోబా భావే వంటి వారి బోధనలతో నమ్మాళ్వార్ ప్రభావితుడయ్యారు. విద్య పరమ లక్ష్యం స్వేచ్ఛను కల్పించడమేని, స్వావలంబనకు స్వేచ్ఛ పునాది అన్న భావన మేల్కొంది. ఈ జ్ఞానాన్ని రైతుల్లో పాదుకొల్పడం కోసం 1979 లో కుడుంభం అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. స్థానిక రైతులతో మమేకమై, వారి సమస్యలను అర్థం చేసుకొని, తగిన పరిష్కారాలు వెదకడంపై దృష్టి కేంద్రీకరించారు. 1984లో బెర్నార్డ్ డిక్లార్క్తో కలిసి పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులపై దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. 2004లో సునామీ వల్ల దెబ్బతిన్న పంట పొలాల పునరుద్ధరణకు విశేష కృషి చేశారు. కడవూరులో ‘వనగం’ పేరిట ఆయన నెలకొల్సిన 55 ఎకరాల సేం ద్రియ వ్యవసాయ క్షేత్రంలో ఎందరో రైతులు శిక్షణ పొందారు. ఆహారం, వ్యవసాయం, ప్రకృతి మధ్య ఉన్న అవినాభావ సంబంధా న్ని, ఆధ్యాత్మిక స్ఫూర్తిని పామర రైతుల మనసుకు హత్తుకునేలా, వారి నుడికారంలో, సామెతలు మేళవించి చెప్పడం నమ్మాళ్వార్ ప్రత్యేకత. ‘ప్రకృతి వనరులు, భూసార పరిరక్షణ’ కోసం 2004లో నమ్మాళ్వార్ చేపట్టిన పాదయాత్ర కావేరీ డెల్టా జిల్లాల్లో రైతాంగాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు ఆకర్షించింది. 344 గ్రామాల్లో 25 రోజుల పాటు 550 కిలోమీటర్ల పొడవున ఆయన కదం తొక్కారు. తన జీవన ప్రస్థానంలో నమ్మాళ్వార్ దేశవిదేశాల్లో విస్తృతంగా పర్యటించి ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయ పద్ధతులపై నిశిత పరిశీలన చేస్తూ.. అవగాహనను పరిపుష్టం చేసుకున్నా రు. అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశారు. గాం ధీగ్రామ్ గ్రామీణ విశ్వవిద్యాలయం (దిండిగల్) ఆయనకు డాక్టరేట్ ఆఫ్ సైన్స్ పట్టాను 2007లో ప్రదానం చేసింది. ప్రతిపాదిత మిథే న్ వెలికితీత ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా గత నెలలో ప్రచారోద్యమం నిర్వహించారు. జీవితాంతం తాను నమ్మిన లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పోరా ట పటిమతో ఉద్యమించిన నమ్మాళ్వార్.. పండుటాకులా చటుక్కున ప్రకృతిలో లీనమైపోయారు. 2013తోపాటే కనుమరుగైపోయా రు. అయినా.. ఆయన ఊపిర్లూది సాకిన సేం ద్రియ వ్యవసాయోద్యమం కొనసాగుతూనే ఉంటుంది. భారతీయ సేంద్రియ వ్యవసాయోద్యమ శిఖరంగా భాసిల్లిన నమ్మాళ్వార్ స్థానాన్ని భర్తీ చేయగలిగిన వారెవరూ లేరు. పంతంగి రాంబాబు.