వలస నేతలకు టికెట్లపై కాంగ్రెస్‌లో లొల్లి..!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ టికెట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో లొల్లి రేపుతోంది. ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో ముగ్గురు ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే టికెట్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్‌కు (ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే), చేవెళ్ల టికెట్ గడ్డం రంజిత్‌రెడ్డి (బీఆర్ఎస్ ఎంపీ)కి, మల్కాజ్గిరి టికెట్ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి (వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్)లకు ఇవ్వడంపై పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిని పునఃసమీక్షించాలని పలువురు నేతలు అంతర్గతంగా కోరుతుండగా, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్ నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడికి లేఖ రాశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రజాభిప్రాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. మరోవైపు రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోనూ మాల సామాజిక వర్గానికి చెందినవారికే టికెట్ ఇవ్వడం పట్ల మాదిగ సామాజిక వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. పార్టీ నేతల వద్ద తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మితోపాటు 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.
కాంగ్రెస్ కేడర్‌ను అవమానపరిచినట్టే!
ఇటీవలే పార్టీలో చేరినవారికి కాంగ్రెస్ లోక్‌సభ టికెట్లు కేటాయించడం కాంగ్రెస్ కార్యకర్తలను అవమానపర్చినట్టేనని, వారిని నైతికంగా దెబ్బతీస్తుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ‘‘తెలంగాణలో మార్పు కోరుకున్న ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించారు. ఆ పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం ప్రజాభిప్రాయానికి విరుద్ధం. ఇలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు, కేడర్‌కు ఎలాంటి సంకేతాలు పంపుతాయనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీకి విధేయులుగా ఉండేవారికి టికెట్లు ఇవ్వండి’’ అని లేఖలో కోరారు.
రిజర్వుడ్ సీట్ల వ్యవహారంలోనూ..
ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపు వ్యవహారం కూడా కాంగ్రెస్‌లో అంతర్గత చర్చకు దారితీస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ సీట్లను మాల సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడంపై మాదిగ సామాజిక వర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేశ్, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి వంటి మాదిగ సామాజిక వర్గం నేతలు ఈసారి లోక్‌సభ టికెట్లను ఆశించారు.
కానీ వారికి ఇవ్వకుండా ఇద్దరు మాల సామాజికవర్గ నేతలకు ఇవ్వడంపై వారు నిరాశలో ఉన్నారని సమాచారం. ఇక నాగర్‌కర్నూల్ టికెట్ పొందిన సీనియర్ నేత మల్లు రవి శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నివాసానికి వెళ్లారు. తనకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. టికెట్ దక్కిన మల్లు రవిని అభినందించిన సంపత్.. మంచి మెజార్టీతో నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ విజయం సాధించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఇద్దరినీ తీసుకుని సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లారు. వీరితో చాలా సేపు సమావేశమైన రేవంత్.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
28 తర్వాతేనా?
కాంగ్రెస్ ఇంకా ఖమ్మం, భువనగిరి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా అభ్యర్థుల ఖరారుపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఈనెల 28 తర్వాత ఢిల్లీలో భేటీకానుంది. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడి హోదాలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ భేటీలో పాల్గొంటారు. రాష్ట్రంలో మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు ఆ భేటీలో అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలిసింది.