వైఎస్ పథకాలు వట్టిపోతాయి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని, ఆయన తదనంతరమే తెలంగాణ ప్రత్యేకవాదం బలపడిందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజాసంక్షేమ పథకాలతో వైఎస్ మహానేతగా ఎదిగారని, ఇప్పుడు రాష్ట్రం విడిపోతే ఆ పథకాలన్నింటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు విజయమ్మ, జగన్ చేస్తున్న పోరాటానికి తెలుగువారంతా సంఘీభావం ప్రకటించాలని కోరారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఆధ్వర్యంలో గురువారం కర్నూల్లో ‘ఎవరెటు..?’ అనే అంశంపై చైతన్య సదస్సు నిర్వహించారు. ఐక్యంగా ఉన్న రాష్ట్రాన్ని స్వార్థరాజకీయ శక్తులు చీల్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ భాగస్వామ్యమున్న ఆ నగరాన్ని వదిలివెళ్లాల్సిందేనా అని ప్రశ్నించారు.
కర్నూలు జిల్లా విద్యాసంస్థల జేఏసీ వైస్ చైర్మన్ జి. పుల్లయ్య మాట్లాడుతూ ఇన్నాళ్లూ రాష్ట్రంలో ఏ ప్రాంతం అభివద్ధి చెందినా అది తమదిగా భావించామని, ఇప్పుడు దాన్ని లాగేసుకుంటామంటే ఎలాగని ప్రశ్నించారు. జిల్లా జూనియర్ కళాశాలల జేఏసీ చైర్మన్ కే చెన్నయ్య మాట్లాడుతూ సమైక్య వాదాన్ని సీమాంధ్రకు చెందిన ఏ నాయకుడూ వినిపించకపోవడంవల్లే కాంగ్రెస్ అధినేత్రి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఉస్మానియా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ అన్వర్హుసేన్ మాట్లాడుతూ అరవై ఏళ్లు కష్టపడితే హైదరాబాద్ మహానగరం అయిందని, పదేళ్లలో సీమాంధ్రలో అంతటి నగరం ఎలా రూపుదిద్దుకుంటుందని ప్రశ్నించారు. విభజనవల్ల విద్య-ఉద్యోగ-ఉపాధి-సాగునీటి రంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంటుందని, విడిపోతే సీమాంధ్రలో ఉద్యోగుల జీతాలకూ దిక్కులేకుండా పోతుందని హైదరాబాద్ అందరి ఉమ్మడి ఆస్తి మిగిలిన వక్తలు అన్నారు.