ఉత్కంఠగా ఫలితాల సరళి
సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి జిల్లాలో సర్వత్రా ఆసక్తిని కలిగించింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన ఉదయం 8 గంటల నుంచి తుది రౌండ్ వరకు ఉత్కంఠతో ఫలితాల కోసం ప్రజలు ఎదురు చూశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బిగ్‌స్క్రీన్ వద్ద అభ్యర్థుల వెంట వచ్చిన వారు, రాజకీయ నాయకులు, ఆసక్తికల వర్గాలు ప్రతి రౌండ్ ఫలితాలు ఉత్కంఠతో చూశారు. ప్రతిరౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం కనిపించింది. పలు నియోజకవర్గాల్లో ఆయా రౌండ్లలో ఒక్కొక్కరు చొప్పున ముందంజ వేస్తూ ఫలితం ఆసక్తికరంగా మార్చింది.
నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి ఏడు రౌండ ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కె.శ్రీహరిరావు ఆధిక్యం కనిపించింది. తర్వాతి రౌండ్ నుంచి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇదే ఆధిక్యాన్ని చివరి రౌండ్ వరకు ఆయన కొనసాగించారు. చివరి రౌండ్లో, పోస్టల్ బ్యాలెట్లో కె.శ్రీహరిరావు ఆధిక్యాన్ని సాధించినప్పటికీ విజయం బీఎస్పీ అభ్యర్థినే వరించింది. తాజా మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వరరెడ్డి ఏ రౌండ్లోనూ మిగతా ఇద్దరు అభ్యర్థుల కంటే ఆధిక్యాన్ని కనపర్చలేదు.
ఆసిఫాబాద్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కంటే టీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి ప్రతి రౌండ్లోనూ ముందంజలో ఉండి విజయం సాధించారు.
బోథ్ నియోజకవర్గంలో ఆరో రౌండ్ వరకు టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు ఆధిక్యంలో ఉన్నారు. ఏడో రౌండ్, పదో రౌండ్, పదకొండో రౌండ్లో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అయితే పన్నెండొ రౌండ్‌తోపాటు చివరి రౌండ్ అయిన 16వ, పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు ముందంజలో ఉండి విజయం సాధించారు.
సిర్పూర్ నియోజకవర్గంలో మొదటి, రెండో రౌండ్లలో బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప ముందంజలో ఉన్నారు. మూడో రౌండ్ నుంచి ఏడో రౌండ్ వరకు టీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్య ఆధిక్యంలో నిలిచారు. ఏడో రౌండ్ నుంచి 16వ రౌండ్ వరకు కోనప్ప ఆధిక్యంలో నిలవగా చివరి రౌండ్, పోస్టల్ బ్యాలెట్లో కావేటి సమ్మయ్య ముందంజలో నిలిచారు. తుది ఫలితాల్లో కోనప్ప విజయం సాధించారు.
మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు మొదటి నుంచి చివరిదైన 19వ రౌండ్‌తోపాటు పోస్టల్ బ్యాలెట్లలోనూ ఆధిక్యం కనపరిచి విజయం సాధించారు.
ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా రేఖానాయక్ మొదటి నుంచి చివరిదైన 16వ రౌండ్ వరకు సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిపై రితేష్ రాథోడ్‌పై ఆధిక్యం కనపరిచి గెలుపొందారు.
ముథోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి మొదటి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వేణుగోపాలాచారిపై ఆధిక్యం కనపరిచారు. రెండో, మూడో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి, నాలుగో, ఐదో, ఆరో రౌండ్లో విఠల్‌రెడ్డి, ఏడో, ఎనిమిదో రౌండ్లో చారి, తొమ్మిదో రౌండ్ నుంచి చివరిదైన 17వ రౌండ్ వరకు విఠల్‌రెడ్డి ముందంజలో నిలిచారు. పోస్టల్ బ్యాలెట్లో చారి ముందంజలో నిలిచినా విఠల్‌రెడ్డి విజయం సాధించారు.
చెన్నూర్ నియోజకవర్గంలో 15 రౌండ్లలో ప్రతి రౌండ్‌తోపాటు పోస్టల్ బ్యాలెట్‌లోనూ ఆధిక్యాన్ని సాధించి టీఆర్ఎస్ అభ్యర్థి నల్లాల ఓదెలు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్‌పై గెలుపొందారు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌పై 18 రౌండ్లతోపాటు పోస్టల్‌ఓట్ల సాధనలో ముందు నిలిచారు. ఒక్క 11 రౌండ్లోనే కాంగ్రెస్ అభ్యర్థి భార్గవ్ దేశ్‌పాండే టీఆర్ఎస్ అభ్యర్థి కంటే ముందంజలో నిలిచారు.
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్‌పై అన్ని రౌండ్లతోపాటు పోస్టల్ బ్యాలెట్ల సాధనలోనూ ముందు నిలిచి విజయం సాధించారు.