క్రమబద్ధీకరణకు కొత్త రూపు
మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ అమలు
2014 జనవరి 1కి ముందున్న వాటికే
100 నుంచి 500 గజాల లోపు స్థలాలకే
కొత్త నిబంధనలతో 388 జీఓ విడుదల
జిల్లాలో 2 లక్షల మందికి ప్రయోజనం
ఏలూరు (మెట్రో):
సొంతంగా కట్టుకున్న ఇల్లు, క్రమం తప్పకుండా పన్ను చెల్తిస్తున్నట్లు ధృవీకరణ పత్రాలు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు తదితరాలతో కూడిన స్థలం ఉన్నా అది సొంతం అని చెప్పుకోలేని ఆశక్తత. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నా ఎటువంటి హక్కులు దాఖలు పడకపోగా అధికారులు కన్నెర్ర చేస్తే మరోమాటకు తావులేకుండా కట్టుబట్టలతో రోడ్డున పడాల్సిన దయనీయ స్థితి. తమదనుకున్న స్థలంతో ఎప్పుడు తెగదెంపులు చేసుకోవాల్సి వస్తుందో అన్న భయంతో వందల సంఖ్యలో కుటుంబాలు ప్రభుత్వ స్థలాల్లో కాలం వెళ్లదీస్తున్నాయి. ప్రస్తుతం ఆ భయాలకు చెక్ పడనుంది
ఆక్రమణ స్థలాలు క్రమబద్ధీకరించే ప్రక్రియ మళ్లీ మొదలైంది. దీనిపై ప్రభుత్వం జారీ చేసిన 388 జీఓను అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలు చివరికి గ్రామాల్లోనూ ప్రభుత్వ స్థలాల్లో ఏళ్లతరబడి కాలం వెళ్లదీస్తున్న ప్రజల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో ఉన్న జీఓలను కాస్త మార్పు చేస్తూ నూతనంగా కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు నిర్దేశిత మొత్తాన్ని వసూలు చేయనున్నారు. ఇప్పటికే గతంలో నగరాల పరిధిలో క్రమబద్ధీకరణకు 118, 296 జీఓలు విడుదల చేసిన ప్రభుత్వం వాటిలో మార్పులు చేస్తూ 388 జీఓను విడుదల చేసింది.
వీరికి ప్రయోజనం ః
జీఓ 388 ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువున, ఎగువున ఉన్నవారికి ప్రయోజనకరమే. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో 2014 జనవరి ఒకటో తేదీ నాటికి ముందున్న వారందరికీ ఈ జీఓ వర్తిస్తుంది. 100 గజాల పైబడి, 500 గజాలలోపు ఉన్న స్థలాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆక్రమిత స్థలంలో ఖచ్చితంగా కట్టడం ఉండి తీరాల్సిందే.
ఇలా చెల్లించాలి ః
ఆక్రమణల పూర్తి వివరాలతో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి. ఇంటిపన్ను, రిజిస్టర్ డాక్యుమెంటు, విద్యుత్ బిల్లు, నీటి పన్ను బిల్లు వంటివి జతచేయాలి. ఆధార్‌కార్డు నకలు అందించాలి. క్రమబద్ధీకరణకు సంబంధిత దరఖాస్తు అర్హత సాధించిన తరువాత ఎంతమొత్తం చెల్లించాలనే విషయాన్ని ఓ నోటీసు ద్వారా అధికారులు తెలియజేస్తారు. నిర్ణయించిన మొత్తం సొమ్మును నాలుగు వాయిదాల్లో చెల్లించాలి. ఆరు నెలల గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఖర్చులు సంబంధిత దరఖాస్తుదారుడే చెల్లించాలి. రిజిస్ట్రేషన్ పూర్తియిన రోజు నుంచి రెండేళ్ల తరువాత భూ బదలాయింపు హక్కులు వర్తిస్తాయి.
పరిశీలన పక్కాః
250 గజాల లోపు స్థలాలను క్రమబద్ధీకరించేందుకు ఆర్డీఓ గానీ, సబ్ కలెక్టర్‌గానీ ఛైర్మన్‌గా కమిటీ వేశారు. ఆ కమిటీలో టౌన్‌ప్లానింగ్ అధికారి, ఎంపీడీఓ సభ్యులుగా ఉంటారు. సంబంధిత తహశీల్దార్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. 250 నుండి 500 గజాల వరకూ కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే కమిటీ పరిష్కరించనుంది. కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే కమిటీకి జాయింట్ కలెక్టర్ సభ్య కన్వీనర్‌గా ఉంటారు. మున్సిపల్ కమిషనర్ గానీ, జడ్పీ సీఈఓ గానీ సభ్యులుగా ఉంటారు. ఆర్డీఓ కమిటీ తిరస్కరిస్తే కలెక్టర్‌కు 30 రోజుల వ్యవధిలో అప్పీలు చేసుకోవచ్చు. కలెక్టర్ కమిటీ తిరస్కరిస్తే సీసీఎల్ఏకు 30 రోజుల వ్యవధిలో అప్పీలు చేసుకోవచ్చు.
ఇవీ నిబంధనలు ః
నగరం, పట్టణం, గ్రామీణ ప్రాంతాలకూ ఈ జీఓ వర్తిస్తుంది. జనవరి 1వ తేదీ 2014లోపు వెలసిన ఆక్రమణలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
ఆక్రమిత స్థలంలో కట్టడం లేదా గుడిసె, లేదా ఏదో ఒకటి ఉండాలి. క్రమబద్ధీకరణకు ఖాళీ స్థలాలను లెక్కలోకి తీసుకోరు. భవిష్యత్ అవసరాల కోసం రిజర్వు చేసిన స్థలాలు, కాలువ గట్లు, నదీ తీర ప్రాంతాలు, రహదారుల విస్తరణ కోసం ఉద్దేశించిన స్థలాలు వంటి వాటిని క్రమబద్ధీకరణకు అనుమతించరు. దీనికి బీపీఎల్, ఏపీఎల్ రెండు వర్గాలూ అర్హులే. బీపీఎల్ కుటుంబాలైతే తెలుపు రేషన్‌కార్డు తప్పనిసరిగా జతచేయాలి. ఒక వేళ తెలుపురేషన్‌కార్డు లేకుంటే తహశీల్దార్ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. కుటుంబానికి ఒకటి మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. యజమాని, అతని భార్యతోపాటుగా మైనర్ పిల్లలు, మైనర్ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లను కలిపి కుటుంబంగా పరిగణిస్తారు.
క్రమబద్ధీకరణ ధరలు ఇలా ః
ఆక్రమిత స్థలం విలువను 2013 మార్కెట్ ధర ఆధారంగా లెక్కిస్తారు. లెక్కించిన మొత్తంలో దారిద్య్ర రేఖకు ఎగువున ఉన్న కుటుంబాలకు 1100 గజాల వరకూ మార్కెట్ విలువలో 7.5శాతం చొప్పున వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు. 101250 గజాల వరకూ (ఏపీఎల్, బీపీఎల్ కుటుంబాలకు) మార్కెట్ విలువలో 15శాతం వసూలు చేస్తారు. 251500 గజాల వరకూ మార్కెట్ విలువలో 30శాతం వసూలు చేస్తారు.