సురేఖ, చరణ్‌లకు మూడో స్థానం
జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ (ఎన్‌ఆర్‌ఏటీ స్టేజ్ 4)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ, వై. చరణ్ రెడ్డిలు తమ తమ విభాగాల్లో మూడో స్థానాల్లో నిలిచారు. గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఈవెంట్లో మహిళల కాంపౌండ్ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోటీలో సురేఖ (146 పాయింట్లు), త్రిషా దేబ్ (పంజాబ్-142)ను ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో రమణ్‌దీప్ కౌర్ (పంజాబ్-134)పై విజయం సాధించిన సురేఖ (144) సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో లిల్లీ చాను (మణిపూర్- 142) చేతిలో సురేఖ (139) పరాజయం పాలైంది. ఈ విభాగంలో లిల్లీ చాను విజేతగా నిలిచింది.
పురుషుల కాంపౌండ్ విభాగంలో తెలుగు కుర్రాడు వై. చరణ్ రెడ్డి మూడో స్థానంలో నిలిచాడు. ప్లే ఆఫ్ ఈవెంట్లో చరణ్ (146 పాయింట్లు) రాజస్థాన్‌కు చెందిన రజత్ చౌహాన్ (140)పై విజయం సాధించాడు. అంతకు ముందు క్వార్టర్ ఫైనల్లో సంతోంబా సింగ్ (ఎస్‌ఎస్‌సీబీ-141.9)ని ఓడించిన చరణ్ (141.10)... ఆ తర్వాత సెమీస్‌లో 139 పాయింట్లు చేసి అభిషేక్ వర్మ (145) చేతిలో ఓటమిపాలయ్యాడు.