అయ్యోపాపం అనాథ
మెదక్ జిల్లా : తల్లి ప్రేమకు పదేళ్ల క్రితమే దూరమయ్యాడు. తండ్రిని మేనమామ హత్య చేశాడు. తండ్రిని చంపిన కేసులో మేనమామ జైలుకు వెళ్లాడు. పోషణ చూసే అమ్మమ్మ నెలరోజుల క్రితమే చనిపోయింది. నా అనేవాళ్లు లేని ఓ అనాథ దీన గాథ ఇది. వివరాల్లోకి వెళితే..18 ఏళ్ల క్రితం రాయికోడ్ మండలం తుమ్నూర్ గ్రామానికి చెందిన నాగయ్య రేగోడ్ మండలం గజ్వాడ గ్రామానికి చెందిన యాదమ్మను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. ఆ దంపతుల కుమారుడు కృష్ణ గజ్వాడ గ్రామంలో 10వతరగతి చదువుతున్నాడు. ఆ బాలుని తల్లి పదేళ్ల క్రితమే చనిపోయింది.
ఈ నెల 6వ తేదీన ఇంట్లో నిద్రలో ఉన్న బాలుడి తండ్రి నాగయ్యను ఆయన బావమరిది శంకరయ్య హత్య చేశాడు. ఆ హత్య కేసులో బాలుడు మేన మామ జైలుకు వెళ్లాడు. నెల రోజుల క్రితం అమ్మమ్మ కూడా మృతి చెందింది. దీంతో ఆ బాలుడు అనాథగా మారాడు. అనాధగా మిగిలిన కృషను చూసిన గ్రామస్తులు అయ్యోపాపం అంటున్నారు. తండ్రి హత్యానంతరం గ్రామ మాజీ సర్పంచ్ బేతమ్మ దుర్గయ్య దంపతులు కృష్ణను చేరదీసి సుమారు ఇరవై రోజులుగా భోజనం పెడుతున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కృష్ణ చదువుతున్నా తల్లిదండ్రులు లేరనే బెంగతో సరిగా చదువుకోవడం లేదు. మనసున్న మా రాజులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ఈ ఆనాధ బాలుడిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరతున్నారు.