గజ్వేల్‌లో నీటి ఎద్దడి నివారణకు రూ.100 కోట్లు
గజ్వేల్: గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలో మం చినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లకుపైగా నిధులను మంజూరుచేయడానికి సిద్ధంగా ఉన్నారని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి గజ్వేల్ పట్టణంలోని మదీన మజీద్‌లో ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు ప్రసంగిస్తూ మంచినీటి సమస్యకు సంబంధించి వార్డుల వారీగా సమగ్ర నివేదికను అందజేస్తే సీఎం నిధులు విడుదల చేయనున్నారని చెప్పారు. ముస్లిం సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ‘రంజాన్’ను రాష్ట్ర పండుగగా ప్రకటించడమే ఇందుకు నిదర్శమన్నారు. గజ్వేల్‌లో ముస్లిం సోదరులకు రూ.కోటితో మోడల్ షాదీఖాన నిర్మించి ఇస్తామని ప్రకటించారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందుకోసమే గడా(గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) పనిచేస్తున్నదని వెల్లడించారు.
అంతకుముందు హరీష్‌రావు.. మండలంలోని సింగాటం గ్రామంలో రూ.6 లక్షలతో నిర్మించతలపెట్టిన మహిళాశక్తి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ భవనానికి మరో రూ. 6 లక్షల మంజూరుచేయడానికి మంత్రి అంగీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణం, చెక్ డ్యామ్‌ల నిర్మాణం కోసం చేసిన విజ్ఞాపనలపై సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత గజ్వేల్‌లోని సంగాపూర్ రోడ్డు పక్కన రూ.30 లక్షలతో నిర్మించతలపెట్టిన ఐసీడీఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. అనంతరం హానీ అనాథ ఆశ్రమంలో బాలురు, బాలికల గదులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పొన్నాల రఘుపతిరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మడుపు భూంరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, నగర పంచాయతీ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాగా జోరుగా వర్షం కురుస్తున్నా మంత్రి హరీష్‌రావు కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం గమనార్హం.