సూరీడమ్మ ఔట్
జి.సిగడాం: వైఎస్ఆర్సీపీ గుర్తుతో గెలిచి.. తీరా ఆ పార్టీ విప్‌నే ధిక్కరించి తెలుగుదేశం మద్దతుతో జి.సిగడాం మండల పరిషత్ అధ్యక్ష పీఠం అధిష్టించిన డొంక సూరీడమ్మకు ఆ ముచ్చట మూడు నెలల్లోనే ముగిసింది. ఎన్నికల అధికారులు అనర్హత వేటు వేయడంతో ఆమె పదవి కోల్పోయారు. ఈ ఏడాది జూలై 4న జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో సూరీడమ్మ విప్ ధిక్కరించి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని మండల వైఎస్ఆర్సీపీ విప్, వాండ్రంగి ఎంపీటీసీ సభ్యుడు ఈసర్ల గోవిందరావు ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన మండల ఎన్నికల అధికారి సుదర్శనదొర ఆదేశాల మేరకు సూరీడమ్మను ఎంపీపీ పదవికి అనర్హురాలిని చేస్తూ ధ్రువీకరణ పత్రాన్ని శనివారం అందజేసినట్లు ఎంపీడీవో కె.హేమసుందరరావు తెలిపారు. జి.సిగడాం ఎంపీపీ పదవిని ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. అలాగే మండలంలోని గెడ్డకంచరాం, డీఆర్‌వలస ఎంపీటీసీ స్థానాలను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దాంతో ఈ రెండు స్థానాల్లో గెలుపొందిన వారిలో ఒకరు ఎంపీపీ పదవి చేపట్టే అవకాశం ఉంది.
కాగా ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన డొంక సూరీడమ్మ. మామిడి బలరాంలు విజయం సాధించారు. జూలై నాలుగో తేదీన జరిగిన ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అభ్యర్థిగా డీఆర్‌వలస ఎంపీటీసీ మామిడి బలరామ్‌ను నిలబెట్టిన వైఎస్ఆర్సీపీ, అతన్నే బలపరచాలంటూ తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. అయితే ఎంపీపీ పదవిపై ఆశపడిన సూరీడమ్మ ఆ విప్‌ను ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం మద్దతుతో ఎంపీపీగా ఎన్నికయ్యారు. దీంతో విప్ ధిక్కరించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఆమెపై అనర్హత వేటు వేశారు. ఫలితంగా ఎంపీపీ పదవి చేపట్టిన 96 రోజుల్లోనే సూరీడమ్మ అధికారానికి పదవులకు దూరమయ్యారు.