గవర్నర్ ఉత్సవ విగ్రహం కాకూడదు: ఎమ్మెల్సీ గాలి
కృష్ణా,గోదావరి నదులపై ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్ర జలవనరుల కమిషన్ సిఫార్సు చేయ్యాలని విభజన చట్టం స్పష్టం చెబుతుందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జలవివాద పబ్బం గడుపుకోవాలనుకుంటున్న కేసీఆర్,కేటీఆర్‌లు ముందు విభజన చట్టాన్ని చదివి ఆ తర్వాత మాట్లాడాలని సూచించారు. హంద్రీనీవా, గారేరు-నగరి, వెలుగొండ, నెట్టెంపాడులను పూర్తి చేయాలని చట్టం సూచిస్తోందన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగడం, ప్రాంతాల పేరుతో ప్రజలను నిందించడం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. ఏపీ ప్రజల హక్కులను కాపాడే విధంగా సెక్షన్-8 అమలు బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు.
గవర్నర్ ఉత్సవ విగ్రహంలాగా కాకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ కూర్చోబెట్టి చర్చించి కేసీఆర్ అండ్ కో చేస్తున్న జలవివాదాలను పరిష్కరించాలని గాలి విజ్ఞప్తి చేశారు.