గాలె స్టేడియాన్ని కూల్చుతున్నారు!
గాలె: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్రికెట్ స్టేడియాల్లో శ్రీలంకలోని గాలె అంతర్జాతీయ స్టేడియం కూడా ఒకటి. ఈ స్టేడియాన్ని 1984లో నిర్మించారు. 1998లో తొలిసారి ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగింది. అయితే, 2004 డిసెంబర్లో వచ్చిన సునామీకి గాలె స్టేడియంలో చాలా భాగం దెబ్బతింది.
ఆ తర్వాత ఈ స్టేడియానికి మరమ్మతులు చేశారు. అయితే, తాజాగా ఈ స్టేడియానికి ఆనుకొని ఉన్న 17వ శతాబ్దానికి చెందిన డచ్‌ఫోర్ట్‌ను కాపాడేందుకు గాను ప్రస్తుతం ఈ స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్‌ను కూల్చేందుకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్ వల్ల కోట గోడ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ డచ్ ఫోర్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా, స్టేడియంలో నిర్మించిన 500 సీట్ల సామర్థ్యం కలిగిన పెవిలియన్ స్టాండ్ వల్ల వారసత్వ జాబితాలో చోటు కోల్పోయే ప్రమాదంలో ఉంది.
ఈ విషయాన్ని శ్రీలంక సాంస్కృతిక శాఖ మంత్రి విజయదాస రాజపక్సే పార్లమెంట్లో వెల్లడించారు. దక్షిణ కొలంబోకు 115 కిలోమీటర్ల దూరంలో గాలెలోనే మరొక స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన తెలిపారు.
గాలె పిచ్ స్పిన్‌కు అనుకూలం. 1998 తరువాత గాలె వేదికగా జరిగిన చాలా మ్యాచ్‌ల్లో శ్రీలంక ఘన విజయాలు సాధించింది. శ్రీలంక జట్టుకు అదృష్ట స్టేడియంగా చెప్పొచ్చు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 278 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
'కోటకు ఉన్న వారసత్వ సంపద గుర్తింపును కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. క్రికెట్ మైదానానికి మరో ప్రత్యమ్నాయం చూడాలి' అని క్రీడా శాఖ మంత్రి ఫైజర్ ముస్తఫా చెప్పాడు. ఈ క్రమంలోనే నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్ గాలె స్టేడియం వేదికగా జరిగే చివరి మ్యాచ్ కానుందని అధికార వర్గాలు తెలిపాయి.