చోరీ చేసిన చోటల్లా.. సెల్ఫీలు
ముగ్గురు వ్యక్తులు యూకేలో ముఠాగా ఏర్పడి గ్యాంబ్లింగ్ మిషిన్లను లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలు చేసేవారు. వీరిలో ఇద్దరు సెల్ఫీల మీద పిచ్చితో చోరీలు చేసి చోటే ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగేవారు. బెంజమిన్ రాబిన్సన్(30), డానియెల్ హట్చిన్సన్(24) లు చోరీలు చేసిన తర్వాత అక్కడే(గ్యాంబ్లింగ్ మిషిన్ల దగ్గర) నవ్వుతూ ఫోజులు ఇచ్చి మరీ సెల్ఫీలు దిగేవారు. చివరికి ఆ సెల్ఫీల పిచ్చే వారు చేసిన నేరాలను నిరూపించడానికి ఆధారాలుగా మారాయి. దీంతో సోమవారం బ్రాడ్ ఫోర్డ్ క్రోన్ కోర్టు ముగ్గురిని దోషిగా తేల్చి శిక్ష విధించింది.
వివరాలు.. స్కిప్టన్ లో 2014 జూన్‌లో అతివేగంగా వెలుతున్నారని పోలీసులు గుర్తించి వారి కారును ఆపారు. నార్త్ యార్క్‌షైర్ పోలీసులు వీరు ప్రయాణిస్తున్న కారులో మాస్కులు, స్క్రూడ్రైవర్లతో పాటూ భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు మాస్కులను తీసేసి మరీ చోరీ చేసిన ప్రదేశంలో దిగిన సెల్ఫీలను కూడా పోలీసులు గుర్తించారు. విచారిస్తున్న సమయంలోనే జాక్ పాట్ కేసును పట్టుకున్నామని మాట్ వాకర్ అనే పోలీసు అధికారి అన్నారు.
చోరీ చేయగా వచ్చిన డబ్బుతో ఏం చేయాలో కూడా ఎలాంటి ముందుస్తు ప్రణాళికలు చేసుకోలేదు. వాళ్ల అత్యాశ, సెల్ఫీల మీద ఉన్న పిచ్చి వాళ్లను నేరస్తులుగా నిరూపించి కటకటాల పాలయ్యేలా చేశాయని పోలీసులు తెలిపారు. పోలీసులు పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో మరో దారిలేకుండా చేసిన నేరాన్ని కోర్టులో అంగీకరించి కటకటాల పాలయ్యారు.